జడ్చర్ల మండలంలోని గంగాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని నలుగురు దుర్మరణం చెందారు.
జడ్చర్ల: మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ మిక్సర్ లారీ అతివేగం నలుగురి ప్రాణాలను బలితీసుకుంది. ఈ విషాద సంఘటన జడ్చర్ల మండలంలోని గంగాపూర్ సమీపంలో చోటుచేసుకుంది.
ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జడ్చర్ల వైపు నుండి గంగాపూర్ వైపు వెళుతున్న మిక్సర్ లారీ ముందు ధాన్యం లోడుతో వెళుతున్న ట్రాక్టర్ ను ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో లారీ డ్రైవర్ ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని గమనించలేడు. దీంతో వేగంగా వెళుతున్న లారీ బైక్ పైకి దూసుకెళ్లింది. దీంతో బైక్ పై వున్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
read more హైదరాబాద్: ప్రభుత్వ స్థలాలే టార్గెట్.. ఫేక్ డాక్యుమెంట్లతో విక్రయం, ముఠా గుట్టు రట్టు
లారీ భీభత్సంతో ముందు వెళుతున్న ట్రాక్టర్ కూడా అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్ డ్రైవర్ కూడా అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృతులను గంగాపూర్‌కి చెందిన రవి, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెంకటాపూర్‌కు చెందిన సురేశ్, ఓ ఫార్మా పరిశ్రమలో పనిచేస్తున్న వెంకటేశ్వర్లుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
