కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివాహానికి వెళ్లి వస్తున్న పెళ్లి బృందం రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. 

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. దోమకొండ మండలం చింతామన్ పల్లి గ్రామానికి చెందిన సంతోష్‌ కు దుబ్బాక మండలం బల్వంతపూర్ గ్రామానికి చెందిన అమ్మాయితో పెళ్లి జరిగింది.  అమ్మాయివారింట జరిగిన పెళ్లికి చింతామన్ పల్లి నుండి బంధువులు, గ్రామస్తులు ఓ ట్రాక్టర్ లో వెళ్లారు. పెళ్లి తంతు ముగిసిన తర్వాత అదే ట్రాక్టర్ లో తిరుగుపయనమైన వీరు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.  

25మంది పెళ్లి బృందంతో ప్రయాణిస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంపై దోమకొండ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.