కామారెడ్డి జిల్లాలో సోమవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బిక్కనూరు మండలం మీదుగా వెళ్లే జాతీయ రహదారిపై ఓ బైక్ ఎదురుగా వేగంగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు మృతిచెందగా కారులో వున్న వారు తీవ్ర గాయాలపాలయ్యారు. 

ఈ ప్రమాదం బస్వాపూర్ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, క్షతగాత్రుల కథనం మేరకు ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.ఏపి 23 హెచ్ 5398 నెంబర్ గల బైక్ పై ముగ్గురు వ్యక్తులు వేగంగా ప్రయాణిస్తూ ఎదురుగా వచ్చిన ఏపీ 25 హెచ్ 5252 నంబర్ గల కారును ఢీకొట్టారు. రెండు వాహనాలు అతివేగంతో ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో బైక్ తో  సహా దానిపై వున్న ముగ్గురు ఎగిరి రోడ్డు పక్కన పడిపోయారు. ప్రమాద  తీవ్రత అధికంగా వుండటంతో ముగ్గురు  అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. 

ఈ ప్రమాదంలో కారు కూడా అదుపుతప్పి రోడ్డ పక్కన గల పొదల్లోకి దూసుకెళ్లింది. దీంతో అందులో ప్రయాణిస్తున్నవారికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ముందుగా క్షతగాత్రులను కామారెడ్డి ఏరియా హాస్పిటల్ కు తరలించారు. అనంతరం మృతదేహాలను కూడా పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ రహదారి నిత్యం ఇలాగే ప్రమాదాలు జరుగుతున్నాయని... ప్రభుత్వం వీటినొ నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామస్ధులు కోరుతున్నారు.