హైదరాబాద్: పార్టీ కల్చర్ పేరిట అర్దరాత్రుల వరకు మద్యం సేవించి రోడ్డుపైకి వస్తున్న కొందరు యువకులు నానా హంగామా సృష్టిస్తున్నారు. ఇలా ఇటీవలే ఏపీకి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే కాటసాని రాంరెడ్డి తనయుడికి ఓబుల్ రెడ్డికి సంబంధించిన కారుతో ఓ యువకుడు యాక్సిడెంట్ చేసి భార్యాభర్తలను బలితీసుకున్నాడు. ఈ ఘటన మరువకముందే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 వద్ద ఓ బెంజ్ కార్ బీభత్సం సృష్టించింది. 

నగరంలోని ఓ పబ్ లో పీకలదాక తాగిన ఇద్దరు యువకులు, ఓ యువతి కారుతో రోడ్డెక్కారు. ఈ మత్తులోనే డ్రైవింగ్ చేసిన యువకుడు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుండి మితిమీరిన వేగంతో బంజారాహిల్స్ వైపు వెళుతూ ఓ క్యాబ్ ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో క్యాబ్ లో వున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే క్యాబ్ తో పాటు ప్రమాదానికి కారణమైన బెంజ్ కారు ధ్వంసమయ్యాయి. 

read more  హైద్రాబాద్‌ హైటెక్‌సిటీ రోడ్డు ప్రమాదం: టెక్కీ కాశీ విశ్వనాథ్ అరెస్ట్

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను వైద్యం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో కారు నడిపి ప్రమాదానికి కారణమైన యువకుడితో పాటు మిగతా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.