హైదరాబాద్: ఉమ్మడి మెదక్ జిల్లాలోని  హకీంపేట, మాసాయిపేట గ్రామాల్లో మాజీ మంత్రి ఈటల రాజేందర్  సతీమణి జమున పేరున ఉన్న నిర్మాణాలపై రెవిన్యూ అధికారులు విచారణ నిర్వహిస్తున్నారు. ఈ రెండు గ్రామాల్లోని ఈటల రాజేందర్ కుటుంబసభ్యులు అసైన్డ్ భూములు ఆక్రమించుకొన్నారనే ఆరోపణలతో  ఆయనను  మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేశారు.ఈటల రాజేందర్ భార్య జమున పేరున హేచరీస్ ఈ భూముల్లో నడుపుతున్నారు. 

also read:కేసీఆర్‌కు మద్ధతుగా టీఆర్ఎస్‌ నేతల ప్రెస్‌మీట్.. అడ్డుకున్న ఈటల వర్గీయులు, ఉద్రిక్తత

 ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు మెదక్ జిల్లా కలెక్టర్ గతంలోనే విచారణ చేసి నివేదికను ఇచ్చారు. ఈ నివేదికపై ఈటల రాజేందర్  కుటుంబసభ్యులు  హైకోర్టును ఆశ్రయించారు. కలెక్టర్ నివేదికను హైకోర్టు పరిగణనలోకి తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది.  అంతేకాదు మళ్లీ నోటీసులు ఇచ్చి విచారణ జరిపించాలని కోరింది.  హైకోర్టు ఆదేశాల మేరకు ఈటల కుటుంబసభ్యులకు మళ్లీ నోటీసులు ఇచ్చి విచారణ చేస్తున్నట్టుగా మాసాయిపేట తహసీల్దార్ ప్రకటించారు. ప్రస్తుతం ప్రాథమిక విచారణ చేశామని రెవిన్యూ అధికారులు తెలిపారు. 


మాసాయిపేట, హకీంపేట గ్రామాలతో పాటు దేవరయంజాల్ గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి చెందిన భూములను కూడ ఈటల రాజేందర్  ఆయన అనుచరులు ఆక్రమించుకొన్నారనే ఆరోపణలపై ప్రభుత్వం ఐఎఎస్ ల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ విచారణ చేస్తోంది.