పట్నం బ్రదర్స్ పై రేవంత్ రెడ్డి సీరియస్ ఆరోపణలు
పట్నం బ్రదర్స్ పై కాంగ్రెసు నేత రేవంత్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు. కొడంగల్ ఆయన ఆదివారం ప్రచార సభలో ప్రసంగించారు. పట్నం బ్రదర్స్ తో వంద కోట్లు ఖర్చు చేయించి తనను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
కొడంగల్: పట్నం బ్రదర్స్ పై కాంగ్రెసు నేత రేవంత్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు. కొడంగల్ ఆయన ఆదివారం ప్రచార సభలో ప్రసంగించారు. పట్నం బ్రదర్స్ తో వంద కోట్లు ఖర్చు చేయించి తనను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆపద్ధర్మ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ లో రేవంత్ రెడ్డిపై పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
తనను ఓడించేందుకు కేసిఆర్ పట్నం బ్రదర్స్‌ను ముఠాలతో పంపిస్తున్నా ప్రజలు మోసపోవద్దని ఆయన అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెసు అధికారంలోకి వస్తే రైతులకు ఏకకాలంలో రుణమాఫీ, పింఛన్ల రెట్టింపు, నిరుద్యోగ భృతి, మహిళా సంఘాలకు రూ.10లక్షల వరకు రుణాలు, సిలిండర్లు తదితర వాటిని అమలుచేయనున్నట్లు తెలిపారు.
బొంరాస్‌పేట్ మండలంలో కార్యకర్తలను టీఆర్‌ఎస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి భయభ్రాంతులకు గురిచేయడం సరి కాదని అన్నారు. పోలేపల్లి, హకీంపేట్ గ్రామాలను మహబూబ్‌నగర్ నుంచి వికారాబాద్‌లో విలీనం చేస్తామని హామీలు ఇచ్చిన మంత్రి మహేందర్‌రెడ్డి ఎందుకు చేయ లేదని ప్రశ్నించారు.