Asianet News TeluguAsianet News Telugu

ఆ 9 మంది తెలంగాణ ఎమ్మెల్యేల‌పై వేటేయండి

  • కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్రపతికి రేవంత్ ఫిర్యాదు
  • ఆప్ ఎమ్మెల్యేల మాదిరిగానే వీళ్లపైనా వేటు వేయాలి
Revanth urges EC to apply office of profit laws in Telangana as well

ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేల త‌ర‌హాలోనే తెలంగాణా రాష్ట్రంలోనూ పార్ల‌మెంటు సెక్ర‌ట‌రీలుగా కొన‌సాగిన ఆరుగురు టీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యేల‌పై కూడా అన‌ర్హ‌త వేటు వేయాల‌ని కాంగ్రెస్ నేత ఎ.రేవంత్ రెడ్డి కోరారు. పార్ల‌మెంటు సెక్ర‌ట‌రీలుగా కొన‌సాగిన  ఆరుగురు ఎమ్మెల్యేలే కాకుండా లాభ‌దాయ‌క‌మైన అద‌న‌పు ప‌ద‌వుల‌లో నియ‌మితులైన మ‌రో ముగ్గురు టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల‌పై కూడా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద అన‌ర్హ‌త వేటు వేయాల‌ని డిమాండ్ చేశారు. ఈ మేర‌కు రాష్ట్ర‌ప‌తికి, చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మీష‌న‌ర్‌కు ఫిర్యాదు చేశారు రేవంత్ రెడ్డి.

Revanth urges EC to apply office of profit laws in Telangana as well

ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసిన తరుణంలో ఆప్ ప్ర‌భుత్వ త‌ర‌హాలోనే తెలంగాణా రాష్ట్రంలోనూ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉల్లంఘ‌న‌కు సంబంధించిన అంశాన్ని రేవంత్ తెర‌మీద‌కు తెచ్చారు. తెలంగానలో జరిగిన తంతుపై ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి తాజాగా ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆరుగురు ఎమ్మెల్యేలను గతంలో పార్లమెంటు కార్యదర్శులుగా నియమించారు. అందులో వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే డి.వినయ్ భాస్కర్, కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు సిఎం కార్యాల‌యంలోనూ,మహబూబ్ న‌గర్ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్ గౌడ్, తుంగతుర్తి ఎమ్మెల్యే జి.కిశోర్ కుమార్ డెప్యుటీ సిఎం కార్యాలయంలోనూ, హుస్నాబాద్ ఎమ్మెల్యే వి.సతీష్ కుమార్ విద్యాశాఖామంత్రి కార్యాలయంలోనూ,ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి రాష్ట్రవ్యవవసాయ శాఖ మంత్రి కార్యాలయంలోనూ   పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2014, డిసెంబర్ 29న జిఓ ఎంఎస్ నెంబర్ 173ని జారీ చేసిందని రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే రాజ్యాంగ విరుద్ధ‌మైన ఈ చ‌ర్య‌ను  రాష్ట్ర హైకోర్టులో సవాల్ చేయగా 2015 మేనెల 1న హైకోర్టు  ఈ నియామకాలను రద్దు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసిందని వివ‌రించారు.

Revanth urges EC to apply office of profit laws in Telangana as well

2014 డిసెంబ‌ర్ నుంచి కోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసే దాకా కూడా వారు ఆ ప‌ద‌వుల్లో కొన‌సాగార‌ని చెప్పారు. ఈ వ్య‌వ‌హారంలో తీర్పు ఇచ్చిన‌ప్పుడే ఇక‌పై త‌మ‌కు తెలియ‌కుండా ఇలాంటి రాజ్యాంగ విరుద్ధ‌మైన నియామ‌కాల‌ను చేప‌ట్ట‌వ‌ద్ద‌ని  రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని హైకోర్టు ఆదేశించింద‌న్నారు. అయితే ఈ వ్య‌వ‌హారం త‌ర్వాత కూడా తెలంగాణా ప్ర‌భుత్వం కొత్త విధానంలో మ‌రో ముగ్గురు ఎమ్మెల్యేల‌ను కేబినెట్ హోదా ఇచ్చి, కొత్త ప‌ద‌వుల్లో నియ‌మించింద‌ని వెల్ల‌డించారు. జీవో ఆర్‌టి నెంబ‌ర్ .613,  ద్వారా మాన‌కొండూరు ఎమ్మెల్యే ఈర్పుల బాల‌కిష‌న్ అలియాస్ ర‌స‌మ‌యి బాల‌కిష‌న్‌ను  తెలంగాణా  సాంసృ్క‌తిక సార‌థి ( క‌ల్చ‌ర‌ల్ హెడ్ ) గానూ, జీవో ఎంఎస్ నెంబ‌ర్ 32  తేదీ 27.04.2016 ద్వారా  రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ కు ఆర్టి సి ఛైర్మెన్ గానూ, జీవో ఎంఎస్ నెంబ‌ర్ 32, తేదీ 26.04.2016 ద్వారా   బాల్కొండ ఎమ్మెల్యే వి.ప్రశాంత్ రెడ్డిని పంచాయతీరాజ్  రూరల్ డెవలప్ మెంట్ వైస్ ఛైర్మన్ గానూ నియ‌మించార‌ని రేవంత్ ఫిర్యాదు చేశారు.

ఈ ప‌ద‌వుల‌ను కేబినెట్ హోదాతో ఇవ్వ‌డంతో వారు ఆ హోదాకు సంబంధించిన అన్ని సౌక‌ర్యాల‌ను, లాభాల‌ను పొందుతున్నార‌ని ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్యే ప‌ద‌వుల్లో కొన‌సాగే వీల్లేద‌ని వివ‌రించారు. ఈ విష‌యాల‌ను ప‌రిశీలించి ఆప్ ఎమ్మెల్యేల త‌ర‌హాలోనే టీఆర్ ఎస్ కు చెందిన ఈ తొమ్మిది మంది ఎమ్మెల్యేల‌పై కూడా త‌క్ష‌ణం అన‌ర్హ‌త వేటును వేయాల‌ని రేవంత్ రెడ్డి రాష్ట్ర‌ప‌తి, ఎన్నిక‌ల క‌మీష‌న్‌ను కోరారు. త‌న ఫిర్యాదును ఆన్‌లైన్ ద్వారా రాష్ట్ర‌ప‌తి, చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్‌, స్టేట్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్‌కు పంపామ‌ని రేవంత్ ఈ సంద‌ర్భంగా వెల్లడించారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios