Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ తుగ్ల‌క్‌ పాల‌న‌కు ఇదే సాక్ష్యం

  • జిఓల గందరగోళంపై రేవంత్ ట్విట్
  • తుగ్లక్ పానల కాక ఇంకేం పాలన అంటూ కామెంట్
  • రేవంత్ ట్విట్ తో జిఓను సవరించిన అధికారులు
  • కేసిఆర్ సొంత నియోజకవర్గంలోనే ఇట్ల జరుగుతుందా
Revanth tweets evidence for KCRs alleged tughlaq rule

కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత రేవంత్ రెడ్డి కొత్త ప్రచారాస్త్రాన్ని వాడుతున్నారు. ప్రపంచ ప్రముఖులంతా ట్విట్టర్ లో తమ అభిప్రాయాలను షేర్ చేస్తున్న తరుణంలో రేవంత్ కూడా ట్విట్టర్ గూటిని వాడుతున్నారు. తాజాగా సిఎం కేసిఆర్ పై ఘాటైన ట్విట్ చేశారు. ఆ వివరాలు కింద చదువుదాం.

ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గం ఏ జిల్లాలో ఉంద‌నే విష‌యం రాష్ట్ర‌స్థాయిలోని సీనియ‌ర్ ఐఎఎస్ అధికారుల‌కు కూడా తెలియ‌క‌పోవ‌డం రాష్ట్రంలో కొన‌సాగుతున్న తుగ్ల‌క్ పాల‌న‌కు నిద‌ర్శ‌న‌మ‌ని కాంగ్రెస్ నేత ఎ.రేవంత్ రెడ్డి  ఎద్దేవా చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటులో సిఎం కేసీఆర్ ఎలాంటి ప్రామాణిక‌తల‌ను పాటించ‌కుండా , అశాస్త్రీయ  విధానంతో ఇష్టానుసారంగా జిల్లాల‌ను  ఏర్పాటు చేసిన ఫ‌లితంగానే  సిఎం సొంత నియోజ‌క‌వ‌ర్గం ఏ జిల్లాలో ఉంద‌న్న విష‌యం కూడా అధికారుల‌కు అర్థం కాని గంద‌ర‌గోళం నెల‌కొన్నదని విమర్శించారు.

గ‌జ్వేల్‌లోని 50 ప‌డ‌క‌ల ఆస్ప‌త్రిని 100 ప‌డ‌క‌ల ఆస్ప‌త్రిగా మార్చ‌డంతోపాటు దాని స్థాయిని ఏరియా ఆస్ప‌త్రిగా అప్‌గ్రేడ్ చేస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఈనెల 3వ తేదీన జీవో ఆర్‌.టి. నెంబ‌ర్ 5ను జారీ చేసిందన్నారు. అతి ముఖ్య‌మైన ఈ జీవోను జారీ చేసే స‌మ‌యంలో ఎలాంటి పొర‌పాట్లు దొర్ల‌కుండా అధికారులు వివిధ స్థాయిల్లో ఒక‌టికి రెండుసార్లు త‌నిఖీలు చేసి  విడుద‌ల చేసిన ఈ జీవోలో ఒక‌చోట గ‌జ్వేల్ మెద‌క్ జిల్లాకు చెందిందిగా పేర్కొంటూ మిగిలిన చోట గ‌జ్వేల్ నే జిల్లాగా పేర్కొంటూ ఆ జీవో రూపొందించారని తెలిపారు. ఆ జిఓ ప్రతులను గ‌జ్వేల్ జిల్లా క‌లెక్ట‌ర్‌, గ‌జ్వేల్ జిల్లా ఆస్ప‌త్రుల కో ఆర్డినేట‌ర్‌,గ‌జ్వేల్ జిల్లా ఖ‌జానా అధికారికి పంపుతున్న‌ట్లుగా పేర్కొన్నట్లు తెలిపారు. ముఖ్య‌మైన జీవో, అది కూడా సిఎం నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ప్ర‌ధాన‌మైన జీవో విష‌యంలో దొర్లిన‌ త‌ప్పుల‌పై మీడియాలో వార్త‌లు వెలువ‌డ్డాయన్నారు.

ఈ నేప‌థ్యంలో ఈ వ్యవహారంపై రేవంత్ ఈ ట్వీట్ చేశారు. కాగా ఈ జీవో విష‌యంగా తాను ట్వీట్ చేసిన వెంట‌నే అధికారులు  త‌ప్పులు దొర్లిన ఈ జీవోను మార్చేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర‌ప్ర‌భుత్వానికి సంబంధించిన  ఆన్‌లైన్ జీవో రిజిష్ట‌ర్‌లో  మార్చిన ఈ కొత్త జీవో కాపీని అప్‌లోడ్ చేశారన్నారు. అయితే రెండ‌వ సారి ఆన్‌లైన్‌లో పెట్టిన ఈ జీవోలో  గ‌జ్వేల్ జిల్లా అనే ప‌దాన్ని మార్చేసిన అధికారులు గ‌జ్వేల్ స్థానంలో మెద‌క్ జిల్లా అంటూ పేర్కొన్నారన్నారు. వాస్తవానికి సిఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న గ‌జ్వేల్ సిద్ధిపేట జిల్లా ప‌రిధిలో ఉంటుందన్నారు.  రాష్ట్రంలో ముఖ్య‌మంత్రి నియోజ‌క‌ వ‌ర్గం ఎక్క‌డుందో తెలియ‌కుండా ప‌నిచేస్తున్న అధికారులకు ఇక సాధార‌ణ‌ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గాలు వాటిలోని సామాన్య ప్ర‌జ‌లు ప‌డుతున్న క‌ష్టాలు ఎలా తెలుస్తాయ‌ని చురకలంటించారు.

రేవంత్ ట్విట్ ను కింద చూడొచ్చు.

 

Follow Us:
Download App:
  • android
  • ios