Asianet News TeluguAsianet News Telugu

దళితులంటే అంత చులకనా కేసిఆర్ ?

  • దళిత, గిరిజన కుటుంబాలకు మూడెకరాల భూమి ఇవ్వలేదు
  • నిధుల్లో కోత విధిస్తున్నారు
  • 40 నెలల్లో ఎన్ని కుటుంబాలకు ఇచ్చారు?
  • పవర్ ప్లాంట్లు, ప్రాజెక్టులు కట్టే చోట ఉన్న భూములు లాక్కుంటున్నారు
Revanth slams kcr for humiliating dalits in the state

రాష్ట్రంలోని భూమిలేని నిరుపేద ద‌ళిత‌, గిరిజ‌న కుటుంబాల‌న్నింటికీ మూడెక‌రాల భూమి ఇస్తామ‌ని హామీ ఇచ్చిన టిఆర్ఎస్ పార్టీ ప్ర‌భుత్వం ఏర్పడిన 40 నెల‌ల కాలంలో కేవ‌లం మూడు వేల కుటుంబాల‌కు మాత్ర‌మే భూమి ఇచ్చిందని విమర్శించారు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. 40 నెలల్లో 3వేల కుటుంబాలకు ఇవ్వ‌గ‌లిగితే, ఇక రాష్ట్రంలో ఉన్న 3ల‌క్ష‌ల ద‌ళిత‌, గిరిజ‌న కుటుంబాల‌న్నింటికీ భూ పంపిణీ చేయ‌డానికి ఎంత కాలం ప‌డుతుందో టిఆర్ఎస్ నేతలు చెప్పాలని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి నిలదీశారు. ద‌ళిత గిరిజ‌న కుటుంబాల‌కు కొత్త‌గా భూమి ఇవ్వ‌క‌పోగా ఆ కుటుంబాలు త‌ర‌త‌రాలుగా సాగు చేసుకుంటున్న భూముల నుంచి కూడా వారిని టిఆర్ఎస్ సర్కారు రాక్షసంగా త‌రిమికొడుతోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. 

Revanth slams kcr for humiliating dalits in the state

శుక్ర‌వారం న‌ల్ల‌గొండ జిల్లా, దామ‌ర‌చెర్ల మండ‌లంలోని తాళ్ల‌వీర‌ప్ప‌గూడెం గ్రామానికి చెందిన ద‌ళితులు రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వారు తమ గ్రామంలో జరుగుతున్న అన్యాయాలను రేవంత్ దృష్టికి తీసుకొచ్చారు. త‌మ గ్రామానికి చెందిన 25,60,96 స‌ర్వే నెంబ‌ర్ల‌లోని భూముల‌ను తాము తాత‌ తండ్రుల కాలం నుంచి సాగుచేసుకుంటూ వాటిలో కంది, ప‌త్తి, శెన‌గ‌, ఆముదాలు లాంటి వ‌ర్షాధార‌ పంట‌లు పండించుకుంటూ బతుకుతున్నామని గ్రామ‌స్తులు చెప్పారు. అయితే 2015లో యాదాద్రి ధ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్‌కు శంకుస్థాప‌న చేసిన త‌ర్వాత త‌మ భూముల‌లో స‌ర్వే నిర్వ‌హించిన అధికారులు వాటిని ప్లాంటు నిర్మాణం కోసం తీసుకుంటున్నామ‌ని చెప్పార‌న్నారు. అయితే గ్రామంలో ఇదే విధంగా ఇత‌రుల నుంచి తీసుకున్న భూముల‌కు ప‌రిహారాన్ని చెల్లించిన అధికారులు త‌మ భూముల‌కు మాత్రం ఎలాంటి ప‌రిహారాన్ని చెల్లించ‌క‌పోగా అస‌లు మీ భూములే లేవంటున్నార‌ని వాపోయారు. ప్లాంటుకు శంకుస్థాప‌న చేసిన  త‌ర్వాత నుంచి త‌మ‌ను భ‌ముల్లోకి రానివ్వ‌కుండా అడ్డుకోవ‌డంతో గ‌త మూడేళ్ల‌గా ఆ భూములు బీడుప‌డ్డాయ‌ని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ఇదే విష‌యాన్ని నెపంగా చూపుతూ బీడుప‌డిన భూముల‌కు ప‌రిహారం ఇచ్చేదిలేదంటున్నార‌ని ఆరోపించారు. అగ్ర‌వ‌ర్ణాల‌కు చెందిన వారి భూములు బీడుప‌డినా అందులో రాళ్లుర‌ప్ప‌లూ ఉన్నా వాటికి ప‌రిహారం ఇచ్చారని, తమకు మాత్రం పరిహారం ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. ద‌ళితులైనందుకే అధికారులు తమ‌కు అన్యాయం చేస్తున్నార‌ని వారు పేర్కొన్నారు. త‌మ‌కు న్యాయం జ‌రిగేలా చూడాల‌ని వారు కోరారు. 

ఈ సంద‌ర్భంగా రేవంత్ మాట్లాడుతూ త‌ర‌త‌రాలుగా సాగు చేసుకుంటున్న భూముల నుంచి ద‌ళితుల‌ను త‌రిమికొట్ట‌డం ఎంత వ‌ర‌కు న్యాయ‌మ‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌తి ద‌ళిత గిరిజ‌న కుటుంబానికీ 3 ఎక‌రాల  భూమి ఇస్తామని హామీ ఇచ్చిన ప్ర‌భుత్వం కొత్త భూములు ఇవ్వ‌క‌పోగా ఈ విధంగా ఉన్న భూముల‌ను కూడా లాగేసుకోవ‌డం అమానుషం అన్నారు. థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంటు ప‌రిధిలో భూముల  కోల్పోయిన ప్ర‌తి రైతుకూ ప‌రిహారం ఇచ్చి తీరాలని డిమాండ్ చేశారు. తాడ్వాయి అడ‌వుల్లో పోడు చేసుకుంటున్న  గొత్తికోయ‌ల‌పై అట‌వీ అధికారులు దాడుల చేసి వారిని వారి భూముల నుంచి వెళ్ల‌గొట్టిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌స్తావించారు. రాష్ట్ర‌వ్యాప్తంగా 3 ల‌క్ష‌ల ద‌ళిత‌, గిరిజ‌న కుటుంబాలు ఉండ‌గా అందులో కేవ‌లం 3741 కుటుంబాల‌కు మాత్ర‌మే గ‌డిచిన మూడేళ్ల‌కాలంలో ప్ర‌భుత్వం భూముల‌ను ఇవ్వ‌గ‌లిగింద‌న్నారు. అయితే భూమికి సంబంధించిన ప‌ట్టాలు ఇచ్చినా ఇంకా అనేక‌చోట్ల స‌ర్వేచేసి ప‌ట్టా ఇచ్చిన‌ భూముల‌ను చూపించ‌లేదని విమ‌ర్శించారు. 

ద‌ళిత‌, గిరిజ‌నుల భూముల కొనుగోలుకు అవ‌స‌ర‌మైన బ‌డ్జెట్ ను కూడా ప్ర‌భుత్వం పూర్తి స్థాయిలో ఇవ్వ‌డం లేద‌ని ఆరోపించారు. ప్ర‌తియేటా భూముల కొనుగోలుకు క‌నీసం రూ.5 వేల కోట్ల బ‌డ్జెట్ ను ప్ర‌త్యేకంగా కేటాయించాల్సి ఉండ‌గా ప్ర‌భుత్వం నామ మాత్ర‌పు నిధుల‌ను మాత్ర‌మే కేటాయిస్తోంద‌ని రేవంత్ ధ్వ‌జ‌మెత్తారు. 2014-15లో రూ.77 కోట్లు, 2015-16లో రూ.220 కోట్లు కేటాయించిన ప్ర‌భుత్వం ఆ త‌ర్వాత వాటిని మ‌రింత‌గా త‌గ్గిస్తూ 2016-17లో రూ.117 కోట్ల‌ను, 2017-18లో రూ.93 కోట్ల‌ను మాత్ర‌మే కేటాయించింద‌ని వెల్ల‌డించారు. ఈ భూముల కొనుగోళ్ల‌లోనూ అధికార‌ప‌క్షం నేత‌లు చేతివాటం చూపుతున్నార‌ని ఆరోపించారు. ఇంకా ప‌లు జిల్లాల‌లో ఒక్క ద‌ళిత కుటుంబానికి కూడా భూమిని ఇవ్వని ప‌రిస్థితులు ఉన్నాయ‌ని చెప్పారు. థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ కేంద్రాలు,  సాగునీటి ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన ద‌ళిత గిరిజ‌నుల‌కు ప్ర‌భుత్వం న్యాయం  చేయ‌క‌పోతే తాము రైతుల ప‌క్షాన న్యాయస్థానం త‌లుపు త‌డ‌తామ‌ని హెచ్చ‌రించారు.

Follow Us:
Download App:
  • android
  • ios