ఓయూలో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని నిరసన తెలిపే క్రమంలో అరెస్ట్ అయిన ఎన్‌ఎస్‌యూఐ నేతలను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఇతర నాయకులు సోమవారం చంచల్ గూడ జైలులో పరామర్శించారు. 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ సందర్శన వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఓయూలో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని నిరసన తెలిపే క్రమంలో అరెస్ట్ అయిన ఎన్‌ఎస్‌యూఐ నేతలను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఇతర నాయకులు సోమవారం చంచల్ గూడ జైలులో పరామర్శించారు. ఒకవేళ ఎన్‌ఎస్‌యూఐ నేతలు రాహుల్ పర్యటనలోపు విడుదల కాకుంటే.. ఈ నెల 7 వారిని పరామర్శించేందుకు ఆయనే జైలుకు వస్తారని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ జైలు సూపరిండెంటెంట్‌కు వినతి పత్రం అందజేశారు. 

జైలులో ఎన్‌ఎస్‌యూఐ నేతలను పరామర్శించిన అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అత్యంత క్రియాశీలక పాత్ర ఇచ్చారని తెలిపారు. తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కళను నెరవేర్చారని చెప్పారు.రాహుల్ గాంధీ 6వ తేదీ వరంగల్‌లో రైతు సంఘర్షణ సభలో పాల్గొంటారని చెప్పారు. తెలంగాణ రైతు ఆత్మ హత్యలతో శవాల దిబ్బగా మారుతోందని అని అన్నారు. పంటను కొనే దిక్కులేక రైతు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. వారికి అండగా నిలవడానికి రాహుల్ వస్తున్నారని తెలిపారు. 

రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ సందర్శిస్తారని చెప్పారు. రాహుల్‌గాంధీ ఓయూ విద్యార్థులతో మాట్లాడనున్నారని తెలిపారు. యూజీసీ నిధులు సరిగా వినియోగం అవుతున్నాయా? లేదా? తెలుసుకుంటారని అన్నారు. 

ఓయూలో నియామకాలు సరిగా జరుగుతున్నాయా? లేదా? రాహుల్ గాంధీ తెలుసుకుంటారని చెప్పారు. రాహుల్ గాంధీ ఓయూ సభకు అనుమతి అడిగినందుకు విద్యార్థి నాయకులను జైలులో పెట్టారని మండిపడ్డారు. ఎన్‌ఎస్‌యూఐ నాయకులపై పోలీసులు అక్రమ కేసులుపెట్టారని మండిపడ్డారు.

జగ్గారెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ కచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీని సందర్శిస్తారని చెప్పారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ఎన్‌ఎస్‌యూఐ నాయకులను అరెస్ట్ చేశారని చెప్పారు. అయితే ఓయూలో రాహుల్ పర్యటనకు వీసీ అనుమతి నిరాకరించారు. రాజకీయ సభలకు ఓయూలో అనుమతివ్వకూడదని పాలక మండలి నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఇతర సంఘాల నుంచి అభ్యంతరాలు ఉన్నాయని తెలిపారు. శాంతిభద్రతలను కూడా పరిగణలోకి తీసుకుని అనుమతి ఇవ్వడం లేదని వెల్లడించారు. ఓయూలో అధికారుల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదలైందని తెలిపారు. మరోవైపు నేడు కూడా ఓయూలో ఎన్‌ఎస్‌యూఐ నాయకులు నిరసన వ్యక్తం చేయగా.. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఓయూలో టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది.