Anumula Revanth Reddy:అనుముల రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకార ముహుర్తంలో స్వల్ప మార్పు
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవ ముహుర్తంలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవ సమయంలో స్వల్ప మార్పు జరిగింది. రేవంత్ రెడ్డి ఈ నెల 7వ తేదీన ఎల్ బీ స్టేడియంలో మధ్యాహ్నం 01:04 గంటలకు ప్రమాణం చేయనున్నారు.ముందుగా నిర్ణయించిన ముహుర్తం ప్రకారం ఉదయం 10:28 గంటలకు ప్రమాణం చేయాలని భావించారు. అయితే సీఎంగా ప్రమాణం చేసే ముహుర్తంలో స్వల్పంగా మార్పు చేశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రమాణం చేయనున్నారు. రేవంత్ రెడ్డితో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రమాణం చేయించనున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్ష నేతగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎంపిక చేసింది. కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్ష నేత ఎంపిక బాధ్యతను మల్లికార్జున ఖర్గేకు అప్పగిస్తూ ఈ నెల 4న జరిగిన సీఎల్పీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు.ఎమ్మెల్యేలతో విడివిడిగా కూడ అభిప్రాయాలను సేకరించారు.ఈ ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొన్నారు. ఈ నెల 5వ తేదీన కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కే.సీ. వేణుగోపాల్ రేవంత్ రెడ్డి సీఎల్పీ నేతగా ఎంపిక చేసినట్టుగా ప్రకటించారు. రేపు సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేయనున్నారు.
also read:Anumula Revanth Reddy: రేవంత్ కేబినెట్ లో ముగ్గురు డిప్యూటీ సీఎంలు: ఛాన్స్ వీరికే
కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు రేవంత్ రెడ్డి నిన్న రాత్రే న్యూఢిల్లీకి వెళ్లారు. మంత్రివర్గ కూర్పుపై రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చిస్తున్నారు. మరో వైపు రేపు తన ప్రమాణ స్వీకారోత్సవానికి కూడ ఆహ్వానించారు. ఈ ఏడాది నవంబర్ 30న జరిగిన పోలింగ్ లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలను దక్కించుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ తొలిసారి అధికారాన్ని దక్కించుకుంది. గద పదేళ్లుగా తెలంగాణలో అధికారం కోసం కాంగ్రెస్ శతవిధాల ప్రయత్నాలు చేసింది. కానీ, కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరంగానే ఉంది.