Asianet News TeluguAsianet News Telugu

సర్పంచ్‌ల హక్కులను కాలరాస్తున్నారు.. అలాంటప్పుడు కేటీఆర్ మీద చర్యలు ఎందుకు తీసుకోరు?: రేవంత్ రెడ్డి

కేసీఆర్ ప్రభుత్వం సర్పంచ్‌ల హక్కులను కాలరాస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. సర్పంచ్‌ల నిధులు రాష్ట్ర ప్రభుత్వం దొంగిలిస్తోందని ఆరోపించారు. 

Revanth reddy speech at congress protest on sarpanches problems
Author
First Published Jan 9, 2023, 4:09 PM IST

కేసీఆర్ ప్రభుత్వం సర్పంచ్‌ల హక్కులను కాలరాస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. సర్పంచ్‌ల నిధులు రాష్ట్ర ప్రభుత్వం దొంగిలిస్తోందని ఆరోపించారు. రూ. 35 వేల కోట్ల సర్పంచ్‌ల నిధులను దారి మళ్లించిందని అన్నారు. ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సర్పంచ్‌ల సమస్యలపై నిర్వహించిన ధర్నాలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సర్పంచ్‌ల సమస్యలపై కేసీఆర్‌కు కనువిప్పు కలగాలని కోరుకుంటున్నట్టుగా చెప్పారు. 

ఆస్తులు అమ్మి, అప్పులు  చేసి సర్పంచ్‌లు పనులు చేశారని అన్నారు. బిక్షాటన చేసి  పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇస్తున్నారని చెప్పారు. నిధులు రాకపోవడంతో కొందరు సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో చెట్లు  చనిపోతే సర్పంచ్‌లను సస్పెండ్ చేస్తామని అంటున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో డ్రైనేజ్ లోపాల వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయని.. అలాంటప్పుడు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. 

హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా మురికి కుప్పలేనని అన్నారు. మూసీ మురికికూపంగా మారిందని విమర్శించారు. బస్తీల్లో ఇళ్లలోకి వెళ్లలేని పరిస్థితి నెలకొందని అన్నారు. ఆ ప్రాంతాల్లో పర్యటించే దమ్ము కేటీఆర్‌కు లేదని విమర్శించారు. గ్రేటర్ హైదరాబాద్ ఆఫ్ మురికి కార్పొరేషన్‌గా మార్చారని మండిపడ్డారు. కాలువలు, చెరువుల్లో పడి ఎంతోమంది చిన్నారులు చనిపోయారని అన్నారు.  కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సర్పంచ్‌ల హక్కులను కాలరాసే చట్టాలను రద్దు చేస్తామని చెప్పారు. సర్పంచ్‌లు ఇంటింటికి తిరిగి కేసీఆర్ గురించి ప్రజలకు చెప్పాలని కోరారు. సర్పంచ్‌లు తలుచుకుంటే కేసీఆర్‌ను బొంద పెట్టొచ్చని అన్నారు.  సర్పంచ్‌ల వ్యవస్థ బాగుంటేనే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పారు. తెలంగాణ ప్రజలు ఇచ్చిన శక్తిని కేసీఆర్ నాశనం చేసుకున్నారని.. పార్టీ పేరు నుంచి తెలంగాణను తొలగించారని..
బీఆర్ఎస్ బతికి బట్టకట్టే పరిస్థితి లేదని విమర్శించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios