Asianet News TeluguAsianet News Telugu

సైనికులకు ఆరు నెలల శిక్షణ ఏం సరిపోతుంది?.. అగ్నిపథ్ తెచ్చి దేశ భద్రతను చీకట్లోకి నెట్టారు: రేవంత్ రెడ్డి

కేంద్రంలోని మోదీ సర్కార్‌ తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌ను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే నేడు మల్కాజ్‌గిరిలో నిర్వహించిన సత్యాగ్రహ దీక్షలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

Revanth Reddy slams Centre govt over Agneepath Scheme at malkajgiri satyagraha deeksha
Author
First Published Jun 27, 2022, 2:02 PM IST

కేంద్రంలోని మోదీ సర్కార్‌ తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌ను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే ఈ రోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్ష చేపట్టింది. తెలంగాణలో కూడా కాంగ్రెస్‌ నాయకులు అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సత్యాగ్రహ దీక్షలు చేపట్టారు. మల్కాజ్‌గిరిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్నారు. మోదీ అగ్నిపథ్ స్కీమ్‌ను తెచ్చి దేశ భద్రతను చీకట్లోకి నెట్టారని రేవంత్ విమర్శించారు. అవగాహన రాహిత్యంతోనే మోదీ సర్కార్ ఈ నిర్ణయాలు తీసుకుంటుందని మండిపడ్డారు. పోలీసులే తొమ్మిది నెలలు శిక్షణ తీసుకుంటారని.. సైనికులు ఆరు నెలల శిక్షణ ఏం సరిపోతుందని ప్రశ్నించారు. 

నాలుగేళ్లు సైన్యంలో ఆ తరువాత జీవిత కాలం బడా పారిశ్రామిక వేత్తలకు కాపలా కాయలా? అని ప్రశ్నించారు. అగ్నిపథ్‌తో ఉద్యోగ భద్రత లేదని, మాజీ సైనికుల హోదా లేదని, ఫించన్ కూడా లేదని విమర్శించారు. ఇజ్రాయోల్‌తో భారత్‌ను పోల్చడం మూర్ఖత్వం అని విమర్శలు చేశారు. సైన్యం తక్కు కాబట్టి.. ఇజ్రాయోల్‌లో అగ్నిపథ్ వంటి విధానాలు అవసరం అని అన్నారు. అమెరికా లాంటి దేశంతో మన దేశాన్ని పోల్చాలి అని సూచించారు. అగ్నిపథ్ స్కీమ్ తీసుకొచ్చి యువత భవిష్యత్ నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. అగ్నిపథ్ ఉపసంహరించేవరకు పోరాటం చేస్తామని చెప్పారు. 

ఇదిలా ఉంటే.. రేవంత్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సరైన విధానం లేకుండా అర్ధం పర్థం లేని పథకాలన్ని ప్రధాని మోడీ సర్కారు తీసుకొస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. పెద్దగా చదువుకోకపోవడం వల్లే మోడీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ రేవంత్ దుయ్యబట్టారు. అగ్నిపథ్ పథకాన్ని (agnipath) ఉపసంహరించుకుని ప్రధాని క్షమాపణలు చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఆయుధాలు వాడటం ఎలా అన్నది నాలుగేళ్లు నేర్పించి బయటకు పంపితే ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నట్లు రేవంత్ తెలిపారు. 

భారతదేశంలో జనాభాకు ఉద్యోగావకాశాలకు పొంతనలేదని ఆయన అన్నారు. 22 సంవత్సరాలకు ఆర్మీ నుంచి బయటకు వస్తే.. 70 ఏళ్లు వచ్చే వరకు అభ్యర్ధికి ఎలాంటి ఉద్యోగం లేకుండా గాలికి తిరగాల్సిన పరిస్ధితి వుంటుందని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్ధితుల్లో అసాంఘిక శక్తులతో చేతులు కలిపినా.. తీవ్రవాదం వైపు  మళ్లినా , ఉద్యోగావశాలు లేక ప్రభుత్వంపై తిరగబడ్డా మొత్తం దేశ భద్రతకే ప్రమాదం వస్తుందని రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం మోడీ ఇలాంటి అర్ధం పర్ధం లేని నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios