తెలంగాణపై ప్రధానమంత్రి మోదీ వివక్ష చూపుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. గుజరాత్ మీదున్న ప్రత్యేకత తెలంగాణపై ఎందుకు లేదని ప్రశ్నించారు. మోదీ.. గుజరాత్‌కే ప్రధానమంత్రా? దేశం మొత్తానికి ప్రధానమంత్రా? అని ప్రశ్నించారు. 

తెలంగాణపై ప్రధానమంత్రి మోదీ వివక్ష చూపుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. గుజరాత్ మీదున్న ప్రత్యేకత తెలంగాణపై ఎందుకు లేదని ప్రశ్నించారు. మోదీ.. గుజరాత్‌కే ప్రధానమంత్రా? దేశం మొత్తానికి ప్రధానమంత్రా? అని ప్రశ్నించారు. ఈరోజు గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. మహబూబ్‌నగర్‌లో ప్రధాని మోదీ పర్యటనపై విమర్శలు గుప్పించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాపై వరాలు ప్రకటిస్తారని అనుకున్నామని చెప్పారు. తెలంగాణకు గతంలో ఇచ్చిన హామీలను ప్రధాని మోదీ ప్రస్తావించలేదని అన్నారు. విభజన చట్టంలోని హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తెలంగాణకు గిరిజన యూనివర్సిటీని కొత్తగా ఇస్తున్నట్టుగా మోదీ మాట్లాడారని విమర్శించారు. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును మోదీ అపహస్యం చేశారని మండిపడ్డారు. తెలంగాణపై అక్కసు పెంచుకున్న మోదీని తెలంగాణకు తేవడం ప్రజలని అవమాన పరచడమే అని అన్నారు. మోదీ తరపున డీకే అరుణ, కిషన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కుటుంబ పాలన గురించి మాట్లాడిన మోదీ.. బీఆర్ఎస్ దోపిడీ మీద ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. విజయశాంతి, రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, విశ్వేశ్వర రెడ్డి లాంటి వారు ప్రధాని మోదీ సభకు గైర్హాజరయ్యారని అన్నారు. 

మోదీ పర్యటనకు పరోక్షంగా సహకరించిన బీఆర్ఎస్‌ కూడా ద్రోహి అని విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీల మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి బీఆర్ఎస్‌ను గెలిపించేందుకు బీజేపీ యత్నిస్తుందని.. అందుకే మహబూబన్‌నగర్‌, నిజామాబాద్‌లలో మోదీ పర్యటనలు అని విమర్శించారు. నిజామాబాద్ పర్యటనలోనైనా.. విభజన హామీలపై ప్రధాని మోదీ మాట్లాడాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతి చేస్తుందని అంటారని... చర్యలు మాత్రం తీసుకోరని మండిపడ్డారు. 

కేటీఆర్, హరీష్ రావు‌లు బిల్లా రంగాలుగా మారారని విమర్శించారు. బిల్లా రంగాలు లాజిక్‌లేని సన్నాసి మాటలు మాట్లాడితే ఎలా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ హామీలపై విమర్శలు గుప్పిస్తున్నారని.. గతంలో కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్దిపై చర్చకు సిద్దమా? అని ప్రశ్నించారు. బహునాయకత్వం వల్ల తప్పేముందని ప్రశ్నించారు. బిల్లా రంగాలకు కాంగ్రెస్‌ను ప్రశ్నించే నైతికత లేదన్నారు. అక్టోబర్ 10 లేదా 12 న షెడ్యూల్ వస్తుందని.. బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.