Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తొలి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు.. రేవంత్ రెడ్డి

తెలంగాణలోని అధికార బీఆర్ఎస్ ప్రభుత్వంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవడంలో బీఆర్‌ఎస్‌ విఫలమైందని విమర్శించారు.

Revanth Reddy says if Congress wins will give 2 lakh jobs within a year ksm
Author
First Published Apr 27, 2023, 9:33 AM IST

తెలంగాణలోని అధికార బీఆర్ఎస్ ప్రభుత్వంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవడంలో బీఆర్‌ఎస్‌ విఫలమైందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిరుద్యోగ యువత సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూనే ఉందని అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏడాదిలోపే 2 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదిలాబాద్‌లో బుధవారం జరిగిన నిరుద్యోగ నిరసన ర్యాలీలో రేవంత్ రెడ్డి  పాల్గొన్నారు. అనంతరం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. 

తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతున్నప్పుడు చదువుకున్న నిరుద్యోగ యువకుల వయస్సు 25 ఏళ్లు అని.. ఇప్పుడు వారి వయస్సు 35 దాటిందని అన్నారు. వారిలో చాలా మందికి ఇప్పటివరకు ఉద్యోగాలు లేకపోవడంతో వివాహం చేసుకోలేకపోయారని చెప్పారు. సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులందరికీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలుగా రాజకీయ ఉద్యోగాలు లభించాయని మండిపడ్డారు.

Also Read: బ్రాహ్మణి నదిలో పడవ బోల్తా.. 30 మంది ప్రయాణికులతో వెళ్తుండగా ప్రమాదం.. ఇద్దరు గల్లంతు..

బీఆర్ఎస్ హామీ ఇచ్చిన మేరకు తెలంగాణలోని 30 లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఒక్కొక్కరికి రూ. 1.60 లక్షలు నిరుద్యోగ భృతి విడుదల చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాలు మార్కెట్‌లో అమ్ముడవుతున్నాయని మండిపడ్డారు. పదో తరగతి పేపర్ కూడా మార్కెట్‌లోకి వచ్చిందని అన్నారు. ప్రశ్నపత్రాలను భద్రంగా ఉంచడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.

‘‘పదో తరగతి పేపర్ లీక్ చేశారనే ఆరోపణతో అరెస్టయి జైలుకు పంపబడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు అయిన మరుసటి రోజు జైలు నుండి బయటకు వచ్చారు. అయితే టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా నిరసన తెలిపిన యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ సభ్యులను వారం రోజుల పాటు జైల్లో ఉంచారు. దీంతో బీఆర్‌ఎస్, బీజేపీకి చాలా విషయాల్లో స్నేహపూర్వక అవగాహన ఉందనే విషయం బట్టబయలైంది’’ అని రేవంత్ రెడ్డి అన్నారు. 

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ ఘటనకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం నుంచి కేటీఆర్‌ను తప్పించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న టీఎస్‌పీఎస్సీ బోర్డును రద్దు చేసి కొత్త బోర్డును నియమించాలని డిమాండ్‌ చేశారు.

ముస్లింలకు కాంగ్రెస్ నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిందని గుర్తుచేశారు. ముస్లిం రిజర్వేషన్ కోటాను 12 శాతానికి పెంచుతామని బీఆర్‌ఎస్ హామీ ఇచ్చి నేటికీ చేయలేదని విమర్శించారు. మరోవైపు బీజేపీ ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తామని చెబుతుందని అన్నారు. ముస్లింలు ఎటువైపు ఉండాలో నిర్ణయించుకోవాలని రేవంత్ కోరారు. 

ఉమ్మడి ఆదిలాబాద్ ప్రజలు ముఖ్యంగా విద్యార్థులు, యువత వచ్చే ఎన్నికల్లో 10కి 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే.. రాష్ట్రంలో 90 సీట్లను గెలుచుకోవచ్చని అన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios