ఎమ్మెల్యే పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్‌లో రేవంత్ రెడ్డి రాజీనామాను సమర్పించారు. ఈ రాజీనామా లేఖను స్పీకర్ కు ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించారు. అయితే స్పీకర్ మాత్రం రేవంత్ ను కలిసేందుకు నిరాకరించినట్టు సమాచారం..


2017 అక్టోబర్ 28వ తేదీన రేవంత్ రెడ్డి టీడీపికి రాజీనామా చేశారు. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేసి విజయం సాధించారు. అయితే టీడీపీలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.

పార్టీకి రాజీనామా చేసిన  తర్వాత పార్టీ ద్వారా లభించిన  ఎమ్మెల్యే పదవికి కూడ రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ రేవంత్ రెడ్డి ఆ లేఖను  టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు లేఖను పంపారు.

టీడీపీ టిక్కెట్టును ఇచ్చిన చంద్రబాబునాయుడికే తన రాజీనామా లేఖను ఇస్తున్నట్టు రాజీనామా లేఖను కూడ ఆయనకే ఇచ్చినట్టు ఆయన చెప్పారు. ఈ మేరకు ఈ లేఖను స్పీకర్ కు పంపాలని రేవంత్ రెడ్డి చెప్పారు.

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినందున క్వార్టర్ ను, గన్ మెన్లను కూడ తిప్పిపంపారు.  అయితే తాజాగా ముందస్తు ఎన్నికలకు వెళ్లే క్రమంలోనే అసెంబ్లీని రద్దు చేయాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు ఇవాళ కేబినెట్ సమావేశంలో అసెంబ్లీ రద్దు గురించి ఏక వాక్య తీర్మానం చేయనున్నారు.

అసెంబ్లీ రద్దు కంటే ముందే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టు చెప్పారు. అందుకే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయంలో రేవంత్ రెడ్డి అందించారు.కుటుంబంలో ఉన్న గొడవలను పరిష్కరించుకోలేక కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నాడని ఆయన ఆరోపించారు. 

అయితే రేవంత్ అసెంబ్లీ కార్యాలయంలోనే ఉన్న సమయంలోనే స్పీకర్ అసెంబ్లీ నుండి వెళ్లిపోయారు. దీంతో రేవంత్ రెడ్డి  తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయంలో తన రాజీనామా లేఖను అందించారు.