తెలంగాణ సమాజానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాజకీయాలకు అతీతంగా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు ప్రతి ఒక్కరు మద్దతివ్వాలని కోరారు.
తెలంగాణ సమాజానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. గత ఎనిమిదేళ్లుగా భారతదేశం నిర్బంధంలో ఉందన్నారు. దేశంలో భావ స్వేచ్ఛనే కాదు.. బతికే స్వేచ్ఛ కూడా లేదన్నారు. 22 కోట్ల మంది యువత నిరుద్యోగులుగా ఉన్నారని అన్నారు. నిత్యావసరాలు, చమురు ధరలు భగ్గుమంటున్నాయని చెప్పారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే దేశద్రోహం అని బీజేపీ అంటోందని చెప్పారు. రైతులు, యువతకు ఇచ్చిన హామీలను కేసీఆర్ గాలికి వదిలేశారని ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ది కాంగ్రెస్ ఘనతేనని చెప్పారు.
రాజకీయాలకు అతీతంగా భారత్ జోడో యాత్రకు ప్రతి ఒక్కరు మద్దతివ్వాలని కోరారు. రాహుల్ గాంధీతో కలిసి కనీసం ఒక్క కిలోమీటరైనా నడవాలని.. దేశ ఐక్యత ప్రాధాన్యతను చాటాలని కోరారు. రేపు చార్మినార్ వద్ద యాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రేపు సాయంత్రం 5 గంటలకు నెక్లెస్ రోడ్డు వద్ద సభకు కదిలి రావాలని కోరారు. రేపు మధ్యాహ్నం 3గంటలకు చార్మినార్ వద్ద కలుసుకుందాం అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
బ్రిటీష్ వాడు విభిజించి పాలించిన సిద్ధాంతం బీజేపీ పాలనలో మళ్లీ పురుడు పోసుకుందని ఆరోపించారు. దేశంలో 22 కోట్ల మంది యువత నిరుద్యోగులుగా ఉన్నారని అన్నారు. నిత్యావసరాలు, చమురు ధరలు చుక్కలను అంటాయని విమర్శించారు. ఆకలి సూచిలో 107వ స్థానానికి మన దేశం ఎగబాకిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మోదీ పాలనకు.. రాష్ట్రంలో కేసీఆర్ పాలనకు తేడా లేదని అన్నారు. గత ఎనిమిదేళ్లు బీజేపీ అరాచకాలకు టీఆర్ఎస్ వంతపాడిందని ఆరోపించారు. నల్ల చట్టాలకు టీఆర్ఎస్ మద్ధతిచ్చిందని అన్నారు. దేశంలో, రాష్ట్రంలో వ్యవస్థల విధ్వంసానికి అంతే లేదని అన్నారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో అవినీతి ప్రపంచ రికార్డులను బద్ధలు కొడుతోందని ఆరోపించారు. భూ కుంభకోణాలకు అంతే లేదని అన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో దేశం కోసం రాహుల్ గాంధీ అడుగు ముందుకు వేశారని చెప్పారు. ఈ దుస్థితిని ప్రశ్నిస్తూ, బానిస సంకెళ్లను తెంచేస్తూ రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్రగా బయలుదేరారని తెలిపారు. సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో వేసిన తొలి అడుగు రాష్ట్రాలు దాటుతూ అక్టోబర్ 23న తెలంగాణలోకి ప్రవేశించిందని గుర్తుచేశారు. అప్రతిహతంగా సాగిపోతోన్న భారత్ జోడో యాత్ర నవంబర్ 1న చారిత్రక మహా నగరమైన హైదరాబాద్ లోకి ప్రవేశిస్తోందని అన్నారు. చార్మినార్ నుండి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం ఐదు గంటలకు నెక్లెస్ రోడ్ లో బహిరంగ సభకు చేరుకుంటుందని తెలిపారు.
ఈ నేపథ్యంలో చరిత్రను ఒక్క సారి గుర్తు చేసుకుందామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా ఎదిగిందన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మన అస్థిత్వానికి, ఆర్థిక స్థిరత్వానికి కారణం హైదరాబాద్ అని అన్నారు. అలాంటి హైదరాబాద్ ను మనకు వరంగా ఇచ్చింది కాంగ్రెస్ అని అన్నారు. రేపటి భవిష్యత్ కోసం రాహుల్ గాంధీకి మద్ధతుగా నిలుద్దామని పిలుపునిచ్చారు.
