హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెసు పరిస్థితి ఏ మాత్రం బాగుపడే సూచనలు కనిపించడం లేదు. ఎమ్మెల్యేల ఫిరాయింపులతో శాసనసభలో ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయిన కాంగ్రెసు పార్టీ శానససభ వెలుపల కూడా ఏ మాత్రం పుంజుకోవడం లేదు. దానికితోడు, నాయకుల మధ్య విభేదాలు మరింతగా దిగజార్చే పరిస్థితి కల్పిస్తున్నారు.

తెలుగుదేశం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెసులో ఓ కొరకరాని కొయ్యగా తయారవుతున్నారు. ఏకంగా తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికే గురి పెట్టి అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నిక అభ్యర్థిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి తన భార్య పద్మావతి పేరును ప్రకటించారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటనపై రేవంత్ రెడ్డి అగ్గి మీద గుగ్గిలమయ్యారు. ఏకపక్షంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలా ప్రకటన చేస్తారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అలా ప్రకటించినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి షోకాజ్ నోటీసు ఇవ్వాలని ఆయన కాంగ్రెసు తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ కుంతియాను కోరారు. అధిష్టానానికి కూడా సమాచారం ఇవ్వలేదని ఆయన ఫిర్యాదు చేశారు. 

ఏకపక్షంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అభ్యర్థిని ప్రకటించడం తప్పిదమని రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేసిన విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్తానని కుంతియా హామీ ఇచ్చారు. అయితే, హుజూర్ నగర్ అసెంబ్లీ సీటుకు తాను శ్యామల కిరణ్ రెడ్డి పేరును ప్రతిపాదించినట్లు కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. 

ఇదిలావుంటే, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పై కూడా రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కలిసి యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పనిచేయాలనే తమ పార్టీ నిర్ణయాన్ని సంపత్ కుమార్ తప్పు పట్టారు. దానిపై రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. 

సంపత్ కుమార్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సెల్ఫీ దిగేందుకు సంపత్ కుమార్ కు పవన్ కల్యాణ్ అవకాశం ఇవ్వలేదని, అందుకే సంపత్ కుమార్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి తీరు కాంగ్రెసు పార్టీకి నష్టం చేస్తుందా, మేలు చేస్తుందా అనేది తేల్చుకోలేక పార్టీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. 

మరో వైపు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కూడా పార్టీకి నష్టం కలిగించే విధంగానే ఉందని భావిస్తున్నారు. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డిపైనే కాకుండా కుంతియాపై కూడా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. బిజెపిలో చేరడానికి ఆయన చేసిన ప్రయత్నం ఫలించలేదని అంటున్నారు. ఈ స్తితిలో కాంగ్రెసులోనే ఉంటూ సెగ రాజేస్తున్నారు.

సంబంధిత వార్తలు

సెల్ఫీకి పవన్ అవకాశం ఇవ్వలేదనే..: సంపత్ పై రేవంత్ ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ తో దోస్తీపై నిరసన: హీరోను చేయడమేమిటని ప్రశ్న

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: ఉత్తమ్ పద్మావతికి రేవంత్ రెడ్డి నిరసన సెగ

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: కాంగ్రెసు అభ్యర్థి పద్మావతి, ఉత్తమ్ ప్రకటన