Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెసు తీరుతో తీవ్ర అసంతృప్తి: రేవంత్ రెడ్డి ప్రాంతీయ పార్టీ

తెలంగాణలో ప్రాంతీయ పార్టీని స్థాపించి ముందుకు సాగాలనే ఆలోచనతో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాంతీయ పార్టీ కోసం రేవంత్ రెడ్డి ఓ సర్వే చేయించినట్లు సమాచారం.

Revanth Reddy is in plan to launch new regional party
Author
Hyderabad, First Published Aug 26, 2020, 9:04 AM IST

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి కొత్త ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెసు తీరు పట్ల ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. కాంగ్రెసు పార్టీలో ముందుకు సాగడానికి ఏ మాత్రం వెసులుబాటు లేకపోవడం ఆయనను ఇబ్బంది పెడుతున్నట్లు చెబుతున్నారు. 

తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి దక్కితే పార్టీలో కొనసాగాలని, లేదంటే ప్రాంతీయ పార్టీని స్థాపించి ముందుకు సాగాలని ఆయన ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. రేవంత్ రెడ్డిని తెలంగాణలోని పాత కాపులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వి. హనుమంతరావు, జగ్గారెడ్డి వంటివాళ్లు రేవంత్ రెడ్డిని బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు కోమటి రెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. 

రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కావడానికి వారు కూడా ఆటంకంగానే మారారు. ఒక రకంగా కాంగ్రెసులో రేవంత్ రెడ్డికి అంత అనుకూల వాతావరణం లేదు. అయితే, రేవంత్ రెడ్డికి ఒక వర్గం మాత్రం ఉంది. తనతో పాటు పార్టీలో చేరినవారికి కూడా తగిన ప్రాధాన్యం లేదనే ఆసంతృప్తి ఉంది. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీ పెట్టి ముందుకు సాగాలనే యోచనలో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం అది ఆలోచన దశలోనే ఉంది. కానీ, ప్రాంతీయ పార్టీ పెడితే ఏ విధంగా ఉంటుందనే విషయంపై ఆయన కసరత్తు ప్రారంభించారు. మాజీ పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర రెడ్డి తగిన సహకారం అందించడానికి సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు దాంతో ప్రాంతీయ పార్టీ పెడితే ఎలా ఉంటుందనే విషయంపై రేవంత్ రెడ్డి ఓ సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. 

ఆ సర్వే పూర్తిగా క్షేత్ర స్థాయికి వెళ్లి చేయలేదు. 15 మందితో ఆ సర్వే చేయించారని సమాచారం. రేవంత్ రెడ్డి ఆలోచనకు దక్షిణ తెలంగాణ నుంచి మంచి మద్దతు లభిస్తోందని, ఉత్తర తెలంగాణ నుంచి అంతగా మద్దతు లభించడం లేదని ఆయన సర్వేలో తేలినట్లు సమాచారం. గతంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో రేవంత్ రెడ్డికి ఆలోచనకు అనుకూల వాతావరణం వ్యక్తమైనట్లు తెలుస్తోంది. నల్లగొండ, మహబూబ్ నగర్ వంటి జిల్లాల్లో అనుకూల వాతావరణం ఉందని సర్వేలో తేలినట్లు చెబుతున్నారు.  

ఈ స్థితిలో విస్తృత స్థాయి సర్వేకు ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. 150 మందితో సర్వే చేయించాలని, ఒక్కొక్కరికి పది మంది చొప్పున కేటాయించాలని 15 మందితో కూడిన బృందం రేవంత్ రెడ్డి ముందు ప్రతిపాదన ఉంచినట్లు తెలుస్తోంది. దానికి రేవంత్ రెడ్డి నుంచి ఆమోదం లభించాల్సి ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios