పార్లమెంటులో ప్రధాని మోడీ తెలంగాణ ఏర్పాటను ప్రక్రియనే అవమానించారని, తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నిస్తుంటే.. టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు నిమ్మకు నీరెత్తినట్టు కిమ్మనకుండా చట్టసభల్లోనే ఉండిపోయారని విమర్శించారు. తెలంగాణను తెచ్చామని విర్రవీగే టీఆర్ఎస్ పార్టీ ఎందుకు ప్రధాని తీరుపై నిరసనలు చేయడం లేదు అని ప్రశ్నించారు.
హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ((TPCC)) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Modi), తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR)లపై విరుచుకుపడ్డారు. బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటులో తెలంగాణను అవమానించారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే ప్రశ్నించారని తెలిపారు. తెలంగాణ అస్తిత్వాన్నే ప్రశ్నించారని, రాష్ట్ర మనుగడనే ప్రశ్నార్థకం చేసేలా మాట్లాడారని చెప్పారు. చట్టసభల్లో దారుణంగా ప్రధాని మోడీ తెలంగాణపై విషం చిమ్మారని అన్నారు. కానీ, అదే చట్టసభల్లోని టీఆర్ఎస్ నేతలు నిమ్మకు నీరెత్తనట్టు కూర్చుండి ప్రధాని వ్యాఖ్యలకు మద్దతు ఇచ్చారని ఆరోపణలు చేశారు. ప్రధాని మోడీని అడ్డుకోవాల్సిన ఆ పార్టీ నేతలు.. వారితో అంటకాగారని విమర్శించారు.
తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని, పార్టీ నష్టపోతుందని తెలిసి కూడా రాజకీయ త్యాగంతో తెలంగాణను ఏర్పాటు చేసిందని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో యువతకు ఉద్యోగాలు రావాలని 2013లోనే ఐటీఐఆర్ కారిడార్‌కు ప్రతిపాదనలు చేశారని వివరించారు. ఈ నిర్ణయం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదని అన్నారు. కానీ, చట్టసభల్లో ప్రధాని మోడీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రశ్నించినా.. కాంగ్రెస్‌పై ఆరోపణల పర్వం మొదలుపెట్టినా.. టీఆర్ఎస్ ఎందుకు నిలదీయలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ప్రధాని మోడీ చట్టసభల విలువలు, సాంప్రదాయాలను అవమానపరుస్తూ, ఉల్లంఘిస్తూ దారుణ వ్యాఖ్యలు చేశారని, కాంగ్రెస్ ఈ తీరును నిరసించిందని, కానీ, టీఆర్ఎస్ ఆయనకు మద్దతుగానే అక్కడే ఉన్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే ప్రధాని మోడీ వ్యాఖ్యలను, తెలంగాణ సమాజాన్ని ఆయన అవమానపరచడాన్ని నిరసిస్తూ ఆయన దిష్టిబొమ్మను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దహనం చేశాయని అన్నారు. కానీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్.. తెలంగాణను తామే తెచ్చామని గొప్పలు పోయే సీఎం కేసీఆర్ ఎందుకు నిరసనలు చేయలేదని నిలదీశారు. ఇప్పటికి ఐదు రోజులు అవుతున్నదని, కేసీఆర్ ఇప్పటికీ ప్రధాని మోడీ వ్యాఖ్యలను ఖండించలేదని అన్నారు. టీఆర్ఎస్ నేతలు తూతూమంత్రంగా నిరసనలు చేశారని పేర్కొన్నారు.
తెలంగాణ అస్తిత్వాన్నే ప్రశ్నించిన ప్రధాని మోడీని ఎందుకు తప్పుపట్టడం లేదని, ఆయన తీరును ఎందుకు నిరసించడం లేదని టీఆర్ఎస్ పెద్దలను ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కనిపించట్లేదని, కేటీఆర్ ప్రారంభోత్సవాల్లో ఉన్నాడని, హరీష్ రావు అభివృద్ధి కార్యక్రమాల సమీక్షల్లో ఉన్నారని, సంతోష్ ఢిల్లీలో మొక్కలు నాటుతున్నాడని, కవిత ట్విట్టర్‌లో చిలుకపలుకులు పలుకుతున్నదని ఆరోపణలు చేశారు. కానీ, ఎందుకు ప్రధాని మోడీని నిలదీయలేదని ప్రశ్నించారు. తలసాని శ్రీనివాస్, పువ్వాడ అజయ్, మాగంటి గోపీ తెలంగాణ ద్రోహులని, వారు ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారంటే.. రాష్ట్ర సంక్షేమం కోసం వారు ఆందోళనలు చేస్తున్నట్టేనని విశ్వసించగలమా? అని అడిగారు.
కేసీఆర్ కుటుంబం ఎందుకు ప్రత్యక్ష నిరసనల్లో పాల్గొనలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం మోడీతో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని, టీఆర్ఎస్ నేతలు మోడీకి తాబేదారులని స్పష్టం అయిందని అన్నారు. అందుకే వారు ప్రత్యక్ష నిరసనల్లో పాల్గొనలేదని ఆరోపించారు. అలాగే, ఒక వేళ మోడీని విమర్శిస్తే.. కేసీఆర్ కుటుంబం దోపిడీని బయటకు తేవడానికి ఈడీ, ఇన్‌కమ్ ట్యాక్స్ వాళ్లను కేంద్ర ప్రభుత్వం పంపిస్తుందని భయపడ్డారా? అంటూ ప్రశ్నించారు.
