ప్రభుత్వం ఏర్పడిన ఈ ఏడాదిన్నర సమయం పథకాల ప్లానింగ్‌కే సరిపోయిందని ఇకపై పథకాల గ్రౌండింగ్‌పై ఫోకస్‌ పెడతానని సీఎం రేవంత్‌ తెలిపారు. ఓ పథకం ప్రారంభిస్తే.. అర్హులకు అందే వరకు పనిచేస్తానన్నారు. కేసీఆర్‌ విమర్శలు ఏమైనా ఉంటే.. అసెంబ్లీకి వచ్చి చేయాలన్నారు. ''కేసీఆర్‌ చేసిన విధ్వంసంతోనే.. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉంది, కేసీఆర్‌ ఆస్పత్రిలో ఉన్నప్పుడు నేను వెళ్లి పరామర్శించా.. ఎవరూ చావును కోరుకోరు కదా అని అన్నారు రేవంత్. నేను ఇంకా 20 ఏళ్లు రాజకీయాల్లో ఉంటా.. కమిట్‌మెంట్ ఇస్తే చేసి తీరుతానన్నారు. 

తమ ప్రభుత్వం చేసిన పనులు చెప్పుకోవడంలో కొంత వెనుకపడిందని, దాన్ని స్పీడప్ చేయాల్సిన అవసరం ఉందని రేవంత్‌ అన్నారు. ఈ సందర్బంగా పార్టీ ఎమ్మెల్యేలకు రేవంత్‌ దిశానిర్దేశం చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో ప్రదక్షిణలు ఆపి.. వారి నియోజకవర్గాలకు వెళ్లి.. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు వివరించాలన్నారు. 

అధికార యంత్రాంగాన్ని స్ట్రీమ్‌లైన్‌ చేశాం, కేసీఆర్‌లా పథకాలను లాంచ్ చేసి వదిలేయను, ఆయనవి అన్నీ శాంపిల్ పథకాలేనని రేవంత్‌ చెప్పారు. అరెస్టుల విషయంలో తొందరపడితే.. ఏపీలో ఏం జరిగిందో చూశాం కదా అని రేవంత్‌ చెప్పుకొచ్చారు. అధికారుల విషయంలో కొంత సమన్వయం పాటించాలి, కొందరు అధికారులు సంపాదన మార్గంగా ఉన్నారు, అలాంటివాళ్లకు ప్రాధాన్యం ఇవ్వకుండా.. సబ్జెక్ట్‌ ఉన్న వాళ్లను ఎంపిక చేసుకుంటున్నామన్నారు. భూభారతి, ధరణి అంశాలపై.. నవీన్‌ మిట్టల్‌కు పూర్తి అవగాహన ఉందని సీఎం రేవంత్ అన్నారు. 

కొందరు నాయకులు పదవులు రాలేదని నోరుజారుతున్నారు.. అలాంటి వాళ్లకు అవకాశాలు ఉండవని స్పష్టం చేశారు సీఎం రేవంత్. కొందరు ఎమ్మెల్యేలకు పొగరు పెరిగిందని, సీఎల్పీలో చెప్పినా ఎమ్మెల్యేల పనితీరు మారలేదని ఫైర్‌ అయ్యారు. పార్టీలో ఓపికగా ఉంటే పదవులు వస్తాయన్నారు. రాహుల్ గాంధీకి తనకు మంచి మైత్రి ఉందని, ఇది ఎవరో నమ్మాల్సిన అవసరం లేదన్నారు.