హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న ప్రగతి నివేదన సభపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ చక్రవర్తి లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న కేసీఆర్ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పిలుపునిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

టీఆర్ఎస్ సభకు ట్రాక్టర్లపై తరలిరావాలని కేసీఆర్‌ పిలుపునివ్వడం చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఎద్దేవా చేశారు. ట్రాక్టర్‌పై ప్రజారవాణా నేరమని తెలిసినా నేరం చేయమని కేసీఆర్ ఉసిగొల్పుతున్నారని ధ్వజమెత్తారు.

టోల్‌గేట్ ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండికొడుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్‌ సభకు వచ్చే వాహనాలకు మినహాయింపులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. హెచ్ఎండీఏ కమిషనర్ జనార్దన్‌రెడ్డి సర్కార్‌కు వత్తాసు పలుకుతున్నారని దుయ్యబట్టారు. ఔటర్ రింగ్‌రోడ్డును సర్వనాశనం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న కళాకారులను, టీఆర్ఎస్ సభలకు వినియోగించడంపై కోర్టు సుమోటోగా కేసులు పెట్టాలని కోరారు.