తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత చాలా రోజుల పాటు ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మళ్లీ రాజకీయాల్లో యాక్టీవ్ అయ్యారు. కొడంగల్ నియోజకవర్గం నుంచి తనపై పోటీ చేసి గెలిచిన పట్నం నరేందర్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు.

నరేందర్ రెడ్డి ఎన్నికల్లో నిబంధనలను ఉల్లంఘించి, అక్రమ మార్గంలో గెలిచారని పిటిషన్‌లో పేర్కొన్నారు. మద్యం, నగదు పంచడంతో పాటు ఈవీఎంలపైనా అనుమానాలున్నాయన్నారు. అందువల్ల ఆయన ఎన్నికను రద్దు చేసి, నరేందర్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని రేవంత్ రెడ్డి కోరారు.

తాజాగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి మహాకూటమి అభ్యర్థిగా రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్ధిగా పట్నం నరేందర్ రెడ్డి పోటీ చేశారు. హోరాహోరీగా జరిగిన పోరులో నరేందర్ రెడ్డి 10,770 ఓట్ల మెజారిటీతో రేవంత్‌పై గెలవడం సంచలనం కలిగించింది.