Asianet News TeluguAsianet News Telugu

రేవంత్ రెడ్డి ఎఫెక్ట్: పీసీసీ కార్యాలయం గాంధీభవన్ లో వాస్తు మార్పులు

తెలంగాణ కాంగ్రెసు కార్యాలయం గాంధీభవన్ కు పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్ రెడ్డి వాస్తుమార్పులు చేయిస్తున్నారు. ఈ నెల 7వ తేదీన ఆయన పదవీబాధ్యతలు చేపట్టేలోగా వాస్తుమార్పులు పూర్తి కానున్నాయి.

Revanth Reddy effect: Vastu changes in Gandhi Bhavan
Author
Hyderabad, First Published Jul 3, 2021, 9:07 AM IST

హైదరాబాద్: తెలంగాణ పీసీసీ కార్యాలయం గాంధీ భవన్ లో వాస్తు మార్పులు జరుగుతున్నాయి. ఈ నెల 7వ తేదీన రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ లోపల వాస్తుమార్పులు పూర్తయ్యే అవకాశం ఉంది. గాంధీ భవన్ ప్రవేశ మార్గాన్ని మార్చేస్తున్నారు. క్యాంటిన్ వద్ద ఉన్న పాత గేట్ నుంచి లోపలికి ప్రవేశించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 

పార్టీ జెండాలు విక్రయించే గదిని, సెక్యూరిటీ గదులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తూర్పు, ఈశాన్య దిశల్లో ఏ విధమైన బరువు ఉండకుండా చర్యలు తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పాత గేట్ నుంచి గాంధీభవన్ లోకి ప్రవేశించి కొత్త గేట్ నుంచి వెళ్లిపోయే విధంగా మార్పులు చేస్తున్నారు. 

ఈ నెల 7వ తేదీన రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించే కార్యక్రమానికి పెద్ద యెత్తున కార్యకర్తలు, అభిమానులు గాంధీభవన్ కు వచ్చే అవకాశం ఉంది. ఆ రోజు ఉదయం రేవంత్ రెడ్డి తన నివాసం నుంచి బయలుదేరి 10 గంటలకు పెద్దమ్మ తల్లి ఆలయం చేరుకుంటారు. అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న తర్వాత 11 గంటలకు నాంపల్లిలోని దర్గాకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాత 12 గంటలకు గాంధీ భవన్ చేరుకుంటారు. 

కాగా, కాంగ్రెసు తరఫున పోటీ చేసి గెలిచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి టార్గెట్ చేసుకున్నారు. వాళ్లను రాళ్లతో కొట్టాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వాళ్లను రాళ్లతో కొట్టే విషయంలో తాను ముందు ఉంటానని కూడా చెప్పారు. కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే అధికార పార్టీకి అమ్ముడుపోయే సన్నాసులకు సిగ్గుండాలని ఆయన అన్నారు. 

ఏఐసీసీ కార్యదర్శి  సంపత్ కుమార్ ను ఆయన శుక్రవారం హైదరాబాదు మణికొండలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని, లేదంటే తాను స్పీకర్ మీద న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ఆయన అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios