Asianet News TeluguAsianet News Telugu

త్వరలో రాష్ట్రమంతటా పాదయాత్ర.. అధిష్టానం అనుమతితోనే: సీనియర్లకు రేవంత్ కౌంటర్

త్వరలోనే తెలంగాణ అంతా పాదయాత్ర చేస్తానని రేవంత్ ప్రకటించారు. ఇందుకోసం ఏఐసీసీ నుంచి అనుమతి తీసుకుంటానని వెల్లడించారు. 

revanth reddy counter to congress seniors ksp
Author
Hyderabad, First Published Feb 16, 2021, 10:08 PM IST

కొత్త రైతు చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు టీపీసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. గత కొద్దిరోజులుగా రేవంత్ చేస్తున్న రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర ముగింపు నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా రావిరాలలో రాజీవ్ రైతు రణభేరి సభ జరిగింది.

ఈ సందర్భంగా రేవంత్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ..  టీఆర్ఎస్ కూడా భారత్ బంద్‌లో పాల్గొందని, ఆ తర్వాత యూటర్న్ తీసుకుందని ఆయన ఎద్దేవా చేశారు. త్వరలోనే తెలంగాణ అంతా పాదయాత్ర చేస్తానని రేవంత్ ప్రకటించారు. ఇందుకోసం ఏఐసీసీ నుంచి అనుమతి తీసుకుంటానని వెల్లడించారు. కాంగ్రెస్ సునామీ సృష్టించి టీఆర్ఎస్‌ను ముంచుతానని రేవంత్ హెచ్చరించారు. 

ఇదే సభలో కాంగ్రెస్ సీనియర్లకు మాజీ మంత్రి కొండా సురేఖ చురకలు వేశారు. వైఎస్ పాదయాత్రను కూడా ఇలాగే అడ్డుకున్నారని ఆమె మండిపడ్డారు. నాడు అధిష్టానానికి కూడా ఫిర్యాదులు చేశారని సురేఖ గుర్తుచేశారు.

రేవంత్ రెడ్డి పాదయాత్రపై ఫిర్యాదులు ఎందుకని ఆమె నిలదీశారు. టీఆర్ఎస్‌ను గద్దె దించడమే మనందరి లక్ష్యం కావాలని సురేఖ హితవు పలికారు. తెలంగాణ ఇచ్చిన తర్వాత పార్టీ పరిస్ధితి ఏంటో సీనియర్లు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

వైఎస్ అంటే గిట్టనివాళ్లు కూడా పాదయాత్రలో చేరారని కొండా సురేఖ చెప్పారు. మనమంతా ఒకే వేదిక మీదకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. ఉత్తమ్ కుమార్ క్లాస్ లీడర్ అయితే, రేవంత్ రెడ్డి మాస్ లీడర్ అని కొండా సురేఖ అభివర్ణించారు. కేసీఆర్‌కు లాంటి నేతను ఎదుర్కోవాలంటే రేవంత్ రెడ్డి వంటి మాస్ లీడరే సరైనవాడని కొండా సురేఖ తెలిపారు. 

కాగా, తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి వర్సెస్ సీనియర్లు గా ఎప్పటినుంచో నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రైతుల ఉద్యమానికి మద్ధతుగా రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ముగింపుకు వచ్చిన తరుణంలో మరోసారి వీరి మధ్య కుమ్మలాటలు బహిర్గతం అయ్యాయి.

తెలంగాణలో రేవంత్ రెడ్డి దూకుడుకు పగ్గాలు వేయడం తమ వల్ల కాదని కాంగ్రెస్ సీనియర్లకు అర్థమవుతున్నా ఏదో రకంగా అడ్డంకులు కలిగిస్తూనే ఉన్నారు. రేవంత్ రెడ్డి వీటన్నింటికీ సిద్ధపడే ముందుకు సాగుతున్నారు. ఎక్కడా స్పీడ్ తగ్గకుండా చూసుకుంటూ ముందుకు దూకుతున్నారు. ఈ క్రమంలోనే వారికి కౌంటరిచ్చారు రేవంత్. 

Follow Us:
Download App:
  • android
  • ios