హైదరాబాద్‌లో ఎన్నికల వ్యుహాకర్త సునీల్ కనుగోలు ఆధ్వర్యంలోని తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్‌‌పై పోలీసుల దాడిని ఖండిస్తున్నట్టుగా చెప్పారు. ఇందుకు నిరసనగా ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్టుగా చెప్పారు. 

హైదరాబాద్‌లో ఎన్నికల వ్యుహాకర్త సునీల్ కనుగోలు ఆధ్వర్యంలోని తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్‌‌పై పోలీసుల దాడిని ఖండిస్తున్నట్టుగా చెప్పారు. రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ వార్ రూమ్ ఘటనపై మాట్లాడేందుకు రాత్రి రెండు గంటల వరకు పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేసిన ఎవరూ స్పందించలేదని అన్నారు. ఫోన్లకు అందకుండా తిరుగుతున్నారంటే.. వీళ్లు పోలీసులా? దొంగలా? అని ప్రశ్నించారు. 

అక్కడ ఏదైనా తప్పు జరిగితే.. ఫిర్యాదు కాపీని, వారెంట్ కాపీని చూపించి దర్జాగా సోదాలు నిర్వహించవచ్చని చెప్పారు. టీఆర్ఎస్ అల్లరి మూకల మాదిరిగా, కిరాయి గుండాల మాదిరిగా పోలీసులు కాంగ్రెస్ వార్ రూమ్‌పై దాడి చేశారని విమర్శించారు. తెలంగాణలోని పరిస్థితులపై ఇన్నాళ్లు తాము కష్టపడి సేకరించిన డేటాను ఎత్తుకెళ్లారని తెలిపారు. కాంగ్రెస్ వార్ రూమ్‌లో డేటాను ధ్వంసం చేశారని మండిపడ్డారు. ఇది దొంగతనమని.. ఓడిపోతున్నామనే భయంతోనే సీఎం కేసీఆర్ ఈ విధమైన దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 

Also Read: తెలంగాణ కాంగ్రెస్ వార్‌ రూమ్‌లో సోదాలు.. లోక్‌సభలో మాణిక్కం ఠాగూర్ ‌వాయిదా తీర్మానం..

కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ టాస్క్‌ఫోర్స్‌లో కీలకంగా ఉన్న సునీల్ కనుగోలును అరెస్ట్ చేయాలని కేసీఆర్ దుర్మార్గపు ఆలోచన చేస్తున్నారని విమర్శించారు. సునీల్ కనుగోలు చేస్తున్న పని వల్ల మోదీ, కేసీఆర్‌ తప్పులు బయటపడుతున్నాయని అన్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు బీఆర్ఎస్‌ కార్యాలయాన్ని ముట్టడించేందుకు తెలంగాణ భవన్‌ నుంచి బయలుదేరుతున్నట్టుగా చెప్పారు. చట్టాన్ని పాటించకుండా తెలంగాణ వార్‌ రూమ్‌‌పై దాడి ఘటనకు నిరసనగా హైదరాబాద్‌లో పోలీసు కమిషనరేట్‌‌ను అక్కడ తమ పార్టీ నాయకులు ముట్టడిస్తారని చెప్పారు. అలాగే మండల స్థాయిలో కూడా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కేసీఆర్ దిష్టిబొమ్ను దగ్దం చేయనున్నారని చెప్పారు. ఈ ఘటనపై ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ ‌ మాణిక్కం ఠాగూర్‌ లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చారని తెలిపారు. ఈ ఘటనపై న్యాయస్థానాల్లో కూడా పోరాటం చేయనున్నట్టుగా తెలిపారు.