కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఫలాలు కనిపిస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మొదట హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ విజయం సాధించిందని.. ఇప్పుడు కర్ణాటకలో విజయం దిశగా సాగుతుందని చెప్పారు.
హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఫలాలు కనిపిస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మొదట హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ విజయం సాధించిందని.. ఇప్పుడు కర్ణాటకలో విజయం దిశగా సాగుతుందని చెప్పారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. 2019లో కర్ణాటకలో రాహుల్ గాంధీ ప్రసంగాన్ని అడ్డంపెట్టుకుని బీజేపీ ఆయనపై ఎంపీగా అనర్హత వేటు వేయించిందని మండిపడ్డారు. బీజేపీ దేశంలో విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాలను పొందాలని చూస్తుందని విమర్శించారు.
కర్ణాటకలో రాహుల్ ప్రసంగాన్ని అడ్డంపెట్టుకుని కక్ష సాధింపు చర్యలుకు పాల్పడ్డారో.. అక్కడి ప్రజలే బీజేపీని తిరస్కరించారని అన్నారు. భారత్ జోడో యాత్ర ప్రభావంతో కర్ణాటక ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో వచ్చిన ఫలితాలో తెలంగాణలో, దేశ వ్యాప్తంగా వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. విద్వేషపూరితమైన రాజకీయాలకు కర్ణాటక ప్రజలు చరమగీతం పాడారని అన్నారు. ఈ ఫలితాలు దేశ రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకురాబోతున్నాయని అన్నారు.
శ్రీరామున్ని అడ్డం పెట్టుకుని దేశంలో రాజకీయ లబ్ది పొందాలని బీజేపీ చూసిందని మండిపడ్డారు. శ్రీరాముని వల్ల ప్రయోజనం లేదని భజరంగ్‌బలి పేరుతో ప్రయోజనం పొందాలని చూశారని విమర్శించారు. ఈరోజు భజరంగ్‌బలి బీజేపీ మతతత్వ రాజకీయాలను తిరస్కరించి.. దేశ సంక్షేమం కోసం తీర్పు ఇవ్వబోతున్నాడని అన్నారు. మతాన్ని అడ్డంపెట్టుకుని రాజకీయం చేయడం మానేసి.. దేశ అభివృద్ది కోసం ఏం చేస్తారనేది చెప్పాల్సిన బాధ్యత బీజేపీపై ఉందన్నారు.
బీజేపీని ఓడించడం ద్వారా కర్ణాటక ప్రజలు ప్రధాని మోదీని తిరస్కరించారని అన్నారు. జేడీఎస్‌ను తిరస్కరించడం ద్వారా కేసీఆర్‌ను ఓడించారని చెప్పుకొచ్చారు. కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ ఏర్పడితే.. మనుగడ సాగించాలని అనుకున్న కేసీఆర్‌ను అక్కడి ప్రజలు తిరస్కరించారని అన్నారు. దేశంలో సుస్థిర పాలన, సంక్షేమం కోసం కర్ణాటక ప్రజలు కాంగ్రెస్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చారని.. దీనిని టీపీసీసీ స్వాగతిస్తుందని అన్నారు. దక్షిణ భారతదేశంలో బీజేపీకి స్థానం లేదని విమర్శించారు. కేసీఆర్ జేడీఎస్‌కు మద్దతు ఇచ్చారని.. అలాంటి పార్టీ నేడు బీజేపీతో చేతులు కలిపేందుకు చూస్తుందని.. దీనిపై కేసీఆర్ వైఖరి ఏమిటని ప్రశ్నించారు.
