టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తను తాత అయ్యానంటూ ట్వీట్ చేశారు. ఈ మేరకు మనవడితో ఉన్న ఫొటోను షేర్ చేశారు.

హైదరాబాద్ : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాత అయ్యారు. నిత్యం రాజకీయాలతో తలమునకలయ్యే రేవంత్ రెడ్డి తాను తాత అయ్యానని శుభవార్తను ట్విట్టర్లో పంచుకున్నారు. రేవంత్ రెడ్డి కుమార్తె నైమిశా గతవారం బాబుకు జన్మనిచ్చింది. ఆ చిన్నారిని అపురూపంగా చూస్తున్న ఫోటోను రేవంత్ రెడ్డి షేర్ చేస్తూ..‘నా చిట్టి తల్లి నాకు మనవడిని కానుకగా ఇచ్చింది. మీ అందరి ఆశీస్సులు నవజాత శిశువుకు, తల్లికి కావాలి’ అంటూ.. మనవడితో ఉన్న ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశారు. 

Scroll to load tweet…

ఇదిలా ఉండగా, శనివారం నాడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రికి కేటీఆర్ మీద మండిపడ్డారు. తనకు లీగల్ నోటీసులు పంపించడంపై కౌంటర్ వేశారు. కేటీఆర్ లీగల్ నోటీసులను వెనక్కి తీసుకోకపోతే క్రిమినల్ చర్యలు ఉంటాయంటూ రేవంత్ రెడ్డి హెచ్చరించారు. గత నెల 31వ తేదీన కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులపై ఈ మేరకు శనివారం రేవంత్ రెడ్డి స్పందించారు. 

అంతకుముందు హైదరాబాదులోని ఈడి ఆఫీస్ లో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ కు 100 కోట్లు ఇస్తే అమ్మనా బూతులు తిట్టొచ్చా అని సూటిగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా నే మాట్లాడుతూ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, సమంతల ప్రస్తావన తీసుకువచ్చారు. కేటీఆర్ తన పరువు 100 కోట్లు అని ఎలా నిర్ధారించాడని.. రకుల్ ప్రీత్ సింగ్ సినిమాకు ఏమైనా సైన్ చేసినట్లా, సమంతతో సిరీస్ కు సంతకం పెట్టినట్లా అంటూ రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు.

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ విచారణను సిట్టింగ్ జడ్జితో జరిపించాలని టీపీసీసీ చీఫ్ డిమాండ్ చేశారు. పబ్లిక్ డొమైన్ లో కూడా లేని సమాచారం కేటీఆర్ దగ్గరికి ఎలా వచ్చిందని రేవంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. కేటీఆర్ కు దమ్ముంటే పేపర్ లీక్ కేసును సిబిఐ, ఈడికి అప్పగించాలని సవాల్ విసిరారు. తనమీద నిరాహార ఆరోపణలు చేసినందుకు బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ కేటీఆర్.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లకు లీగల్ నోటీసులు పంపించిన సంగతి తెలిసిందే. వీటికి అనగా బహిరంగ క్షేమాపణలు చెప్పకపోతే 100 కోట్లకు పరువు నష్టం దావా ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.