తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘట్‌కేసర్ పీఎస్‌కు తరలివస్తున్నారు. రేవంత్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు ఘట్‌కేసర్ వద్ద అడ్డుకుని.. అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పోలీసు కాల్పుల్లో మరణించిన రాకేష్ అంతిమ యాత్రలో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డి వరంగల్ వెళ్తుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఘట్‌కేసర్ పీఎస్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘట్‌కేసర్ పీఎస్‌కు తరలివస్తున్నారు. రేవంత్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మాజీ మంత్రి కొండా సురేఖ చేరుకున్నారు. అయితే లోనికి వెళ్లేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో కొండా సురేఖ పోలీసు స్టేషన్ గేట్లు తోసుకుని లోనికి వెళ్లారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
ఇక, ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. అగ్నిపథ్ స్కీమ్ తీసుకొచ్చిన కేంద్రంలోని మోదీ సర్కార్‌పై విమర్శలు చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పోలీసుల కాల్పుల్లో మరణించిన వరంగల్ జిల్లా దామెర రాకేష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వరంగల్ వెళ్తున్నట్టుగా చెప్పారు. ఏఐసీసీ ఆదేశాలతో తాను వరంగల్ వెళ్తున్నానని తెలిపారు. రాకేష్ కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలోనే వరంగల్ వెళ్తున్న రేవంత్ రెడ్డిని పోలీసులు.. ఘట్‌కేసర్ ఓఆర్‌ఆర్ సమీపంలో అడ్డుకున్నారు.
పోలీసులు తనను అడ్డుకున్న సందర్భంగా రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. రాకేష్ కుటుంబాన్ని పరామర్శిస్తే, రాకేష్ భౌతిక కాయానికి నివాళులు అరిస్తే.. వరంగల్ వెళ్తే పోలీసులకు వచ్చే ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. రాకేష్‌ను చంపింది టీఆర్ఎస్.. చంపించింది బీజేపీ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. ‘‘టీఆర్ఎస్ మంత్రులు రాకేష్ శవయాత్ర చేయొచ్చు.. అలాగే గులాబీ జెండాలు కట్టుకొని యాత్రలో పాల్గొనవచ్చు. మేము వెళ్ళడానికి కూడా ఇన్ని అడ్డంకులా? చావులను కూడా టీఆర్ఎస్ రాజకీయంగా వాడుకోవాలని చూస్తోంది. ప్రజలను ఎక్కువ కాలం మోసం చేయలేరు. త్వరలో సిరిసిల్లలో నిరుద్యోగ డిక్లేరేషన్ ప్రకటిస్తాం’’ అని అన్నారు.
పోలీసులు రేవంత్ రెడ్డిని అడ్డుకోవడంపై కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగాయి. పోలీసులు తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశాయి. మరోవైపు తనను ఎందుకు అడ్డుకుంటున్నారని రేవంత్ రెడ్డి.. పోలీసులను ప్రశ్నించారు. పోలీసులకు రోజు ఇదో పని అయిపోయిందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. నిన్న బాసర వెళ్తే అక్కడ కూడా అడ్డుకున్నారని.. నేడు ఇక్కడ అడ్డుకుంటున్నారని విమర్శించారు. తాను ప్రస్తుతం తన పార్లమెంట్ నియోజవర్గం పరిధిలోనే ఉన్నానని.. ఇక్కడ తిరిగేందుకు తనకు స్వేచ్చ లేదా..? అని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే పోలీసులుకు, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. అయితే పోలీసులు బలవంతంగా రేవంత్ రెడ్డిని వారి వాహనంలో ఎక్కించి.. అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. అయితే కాంగ్రెస్ శ్రేణులు పోలీసు వాహనాన్ని అడ్డుకునేందు యత్నించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
