తెలంగాణ సిఎం కేసిఆర్ పై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మరోసారి విమర్శల వర్షం కురిపించారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో గాంధీభవన్ లో రేవంత్ మీడియాాతో చిట్ చాట్ చేశారు. తెలంగాణ సిఎం కు ఇంకా బడ్జెట్ మీద పట్టు రాలేదన్నారు. కేసిఆర్ బడి బయట ఉండే విద్యార్థి మాత్రమే అన్నారు. సచివాలయానికి రాని కేసిఆర్ కు బడ్జెట్ మీద పట్టు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. 

అమరుల కుటుంబాలకు గతంలో ఇస్తాన్న భూములు, ఉద్యోగాల ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. బడ్జెట్ లో అమరుల కుటుంబాలకు నిధులు కేటాయించకుండా కేసిఆర్ వారిని మళ్లీ దారుణంగా మోసం చేశాడని ఆరోపించారు. ఈ బడ్జెట్ ద్వారా కేసీఆర్ ప్రభుత్వానికి -అమరవీరుల కుటుంబాలకు బంధం తెగిపోయిందని విమర్శించారు. ఇతర అంశాలపై రేవంత్ మాటల్లోనే..

కేసీఆర్ తప్పుడు లెక్కలు ,మాయ మాటల బడ్జెట్ తో ప్రజలను మోసం చేశారు. కావలిసిన వారికి కమిషన్ లు ఇచ్చేవారికే ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించారు. తెలంగాణ సమాజాన్ని మోసం చేసేవిధంగా బడ్జెట్ ఉంది. అప్పులు తేవడం, అడ్డుగోలు గా ఖర్చు చేయమే కెసిఆర్ కు తెలిసిన విద్య అన్నట్లుగా ఉంది. కేసీఆర్ బడి బయట ఉండే విద్యార్ధి మాత్రమే. సచివాలయానికి రాని కేసీఆర్ కు పరిపాలనపై ఎన్నటికీ పట్టరాదు. కేసీఆర్ ప్రభుత్వానికి అమరవీరుల కుటుంబాలు, రైతు కుటుంబాలు, నిరుద్యోగులు అంటే లెక్కలేదని ఈ బడ్జెట్ తో తేలిపోయింది.

ఈ బడ్జెట్ దెబ్బతో నిన్న మోడీకి పట్టిన గతే రేపు కేసీఆర్ కు పడుతుంది. నాలుగేళ్లయినా బడ్జెట్ పై కేసీఆర్ కు అవగాహన రాలేదు. ఇప్పడి వరకు కేసీఆర్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ 30నుండి 40శాతం లోటు ఉంది. ప్రతిపాదనలు, సవరణలపై కనీస అంచానాలు లేవు. అందుకె పాలనపై కేసిఆర్ కు పట్టులేదని అంటున్నాను. డబుల్ బెడ్ రూమ్ కు బడ్జెట్ లో కేటాయించిన  నిధులు 49వేల ఇండ్లకే సరిపోవు. కేసీఆర్ మూడు లక్షల ఇండ్లు కడతామంటున్నారు ..ఇది ఎలా సాధ్యం మవుతుందో కేసీఆర్ చెప్పాలి. 2016-17లో ఇండ్లకు కేంద్రం ఇచ్చిన ఆరువేల కోట్లనే దారిమళ్లించారు కెసిఆర్.

దళితులకు మూడెకరాల కోసం కేటాయించిన నిధులు ఏ మూలకూ సరిపోవు. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం నాలుగు లక్షలు మంది భూమిలేని దళితులు ఉన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ కు ఒక్క రూపాయ కేటాయింపు లేపోవడం దారుణం. పేదలకు విద్యను దూరం చేస్తున్నారు కేసీఆర్. సాగునీటి రంగం కు గతంలో కేటాయించిన నిధులు ఎందుకు ఖర్చు చేయలేదో చెప్పాలి.

రాష్ట్రంలో నీళ్లు అందుబాటులో ఉన్న భూములకు పెట్టుబడి రాయితీకి ఆరువేల కోట్లు సరిపోతాయి .. పన్నెండు వేల కోట్లు ఎలా పెట్టారు? లేని భూమికి కేటాయింపులా ..? ఇది రైతులను మభ్యపెట్టేందుకే కాదా? రైతుల పై నాలుగేళ్ల లో రుణమాఫీ  కి సంబందించి 12వేల వడ్డీ భారం  పడింది. ఈ బడ్జెట్ ద్వారా రైతులకు రుణమాఫీ చేయలేదని కేసీఆర్ చెప్పారు ..రైతులను పచ్చిగా మోసం చేశారు.