తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి గాంధీభవన్ లో మీడియాతో ముచ్చటించారు. రాష్ట్ర రాజకీయాలతోపాటు కేంద్ర రాజకీయాలపై అనేక ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తెలంగాణ సిఎం కేసిఆర్, మంత్రి కేటిఆర్, పవన్ కళ్యాణ్, ఎర్రబెల్లి దయాకర్ రావు వంటి నేతలపైనా హాట్ కామెంట్స్ చేశారు. ఆయన ఏమన్నారో కింద ఆయన మాట్లలోనే చదవండి.

తెలంగాణ లో అసలు జనసేన ఉందా? అభిమానులు ఉన్నంత మాత్రాన ఓట్లు రాలవు. పవన్ సినీనటుడు అయితే కేసీఆర్ సహజ నటుడు. కేసీఆర్ కు పవన్ పావుగా మారిండు. పవన్ ది కొస మొదలు లేని పర్యటన. కెసిఆర్ బాగా చేస్తుంటే ఇంక ఎవరి మీద పవన్ పోరాటం చేస్తడో?

మాసాయిపేటలో పసిపిల్లలు చనిపోతే కేసిఆర్ పరామర్శించలేదు. గిరిజన మహిళల బట్టలు విప్పి కొట్టారు ,రైతుల కు బేడీలు వేశారు. సిరిసిల్ల లో దళితులపై దాడులను పట్టించుకోని కేసిఆర్ పవన్ కు స్మార్ట్ సిఎం లా కనబడుతున్నడా? పడుకుంటే లేవని సోమరిపోతు మనిషి స్మార్ట్ సిఎం గా పవన్ కు కనబడుతున్నడా? సచివాలయానికి రాని సీఎం స్మార్ట్ సీఎం గా ఉన్నడా? మేకప్ పాకప్ మధ్య జరిగే షూటింగ్ లాంటిదే తెలంగాణాలో పవన్ టూర్. కేసీఆర్ ఆడిస్తున్న తోలు బొమ్మలే పవన్, గవర్నర్ లు.

వర్కింగ్ అవర్స్ లో కెసిఆర్ కు బ్రీత్ ఎనలైజర్ తో చెక్ చేస్తే తెలుస్తుంది ..కేసీఆర్ నిబద్ధత ఎంత ఉందో? తెలంగాణ కాంగ్రెస్ నేత విహెచ్ సీఎం పదవికి అర్హుడు. రాహుల్ దగ్గర పవన్ చెబితే బాగుంటుంది. పవన్ ఈ విషయంలో ఓకే అంటే రాహుల్ దగ్గరికి వపన్ ను తీసుకువెళతా. తెలంగాణ యువత సినిమా ను రాజకీయాలను వేరుగా చూస్తారు.

పవన్ టైటిల్ మార్చి రెండో సినిమా మొదలు పెట్టారు. ఢిల్లీలో సహానీ అనే వ్యక్తి కి కేసీఆర్ కికేబినెట్ హోదా ఇచ్చారు. సహానీ ఏ రాష్ట్రం వాడో కేసీఆర్ తెలంగాణ ప్రజలకు చెప్పాలి. కేటీఆర్ కు సేవలు చేస్తున్నందుకే సహానికి కేబినెట్ ఇచ్చారు. కెసిఆర్ నిజమైన తెలంగాణ వాదీ అయితే డీలిమిటేషన్ వద్దనాలి. డీలిమిటేషన్ చేయకపోతే పోలవరం ముంపు మండలాలు తెలంగాణకు దక్కుతాయి. అమర వీరుల కుటుంబాలను పట్టించుకోలేని కెసిఆర్ ఎలా గొప్పోడో పవన్ చేప్పాలి.

కేసీఆర్ ఇంట్లో రక్తం కారకపోతే తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన అమర వీరుల సంగతేంటి? తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు గుర్తుకు లేవా? పవన్ స్థాయి కి తగ్గట్టు గా మాట్లాడలేదు. సర్కస్ చూడటానికి చాలా మంది వెళతారు ..ఐనంత మాత్రాన వారందరు అక్కడే ఉంటారా? ఐదు షోలకు అనుమతి కోసం వెళ్లిన పవన్ కు తెలంగాణ కష్టాలు తెలుస్తాయి అనుకోవడం భ్రమ. పవన్ ఈ టూర్ తో తెలంగాణ యువతలో ఉన్న హోప్ ను పోగోట్టుకున్నారు.

టీఆరెస్ లో చేరిన ఇతర పార్టీల నేతలకు 90శాతం వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ టికెట్ ఇవ్వరు. తీగలకు ఈ సారీ టీఆరెస్ టికెట్ కట్ చేస్తడు. ఎర్రబెల్లి దయాకర్ రావు జనగాం లో పోటీచేస్తారు. ఈటెల ,హరిష్ ,కడియం ఈ సారి ఎంపీ కీ పోటీచేస్తారు. కేటీఆర్ కు ప్రమాదం అనుకున్న నేతలను కేసీఆర్ ఎంపీ టికెట్ లు ఇస్తారు. టీఆరెస్ లో అసంతృప్తి లేనోళ్ళు  కేసీఆర్ ,కేటీఆర్ మాత్రమే.

నాగం అంటే నాకు గౌరవం ఉంది. నాపై కేసులు పెట్టినప్పుడు నాకు నాగం ధైర్యం చెప్పారు. కష్టాల్లో ఉన్నప్పుడు పలకరించిన వారంటే నాకు గౌరవం. తెలంగాణ లో టిడిపి కాంగ్రెస్ తో పోత్తుంటే పార్టీలో ఉన్న ఆ కొందరైనా ఎమ్మెల్యేలు అవుతారు. త్రిబుల్ తలాక్ పై కాంగ్రెస్ తో కలిసి టిడిపి పార్లమెంట్ లో సంతకం పెట్టింది. ఎన్డీయే తో టిడిపి లేదు అన్నదానికి ఇది అద్దం పడుతుంది.