తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి మరో సంచలన ప్రకటన చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ సిఎం కేసిఆర్ పై తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. ఇప్పటివరకు ఐదు బడ్జెట్ లు ప్రవేశ పెట్టిన సర్కార్ పై కాగ్ మొట్టి కాయలు వేసిందన్నారు. బడ్జెట్ కేటాయింపులు ఖర్చుల్లో 40శాతం వ్యత్యాసం ఉందని కాగ్ నివేదికల్లో పేర్కొందన్నారు.

పరిపాలన పై సీఎం కేసిఆర్ కు పట్టులేకపోవడం...ఆర్థిక వ్యవస్థ మీద నిబద్ధత లేని కారణంగానే ఇలా జరిగిందన్నారు. కెసిఆర్ పూర్తిస్థాయిలో రెస్ట్ తీసుకుంటూ మధ్యమధ్యలో ప్రజల భావోద్వేగాలతో స్లొగన్స్ ఇస్తూ ప్రజలతో ఆడుకుంటున్నాడని విమర్శించారు. కమిషన్ల కోసమే అదనంగా అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని దివాలా తీసేలా చేసిండని మండిపడ్డారు. అవసరానికి మించిన విద్యుత్ ను అత్యధిక ధరలకు కొనుగోలు చేశారని, 5వేల 800ల కోట్లు చెల్లింపులు అక్రమంగా జరిగాయని కాగ్ తేల్చిందన్నారు. రేవంత్ మాట్లాడిన ఫుల్ వీడియో కింద ఉంది చూడొచ్చు.

ఆర్థిక పరిస్థితులు ఇలా అయ్యేందుకు ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందరే కారణమని  చెప్పి ఆయనపై వేటు వేసే చర్యలకు కేసిఆర్ ఉపక్రమిస్తున్నట్లు పత్రికల్లో వచ్చిందన్నారు. కేటాయింపులు...ఖర్చులు...ఆర్థికశాఖకు...మంత్రికి సంబంధంలేకుండా జరపడం నిజంకాదా...? అని ప్రశ్నించారు. వేలకోట్ల పాలమూరు ప్రాజెక్టుల కాంట్రాక్టు బిల్లులు పెండింగ్ లో పెట్టి.. నీకు కావాల్సిన కాళేశ్వరం కాంట్రాక్టు బిల్లులు విడుదల చేయడం నిజంకాదా...? అని ప్రశ్నించారు.

అసలు సీఎం దర్శనభాగ్యమే లేని ఆర్థికశాఖ మంత్రి పై వేటు ఎలా వేస్తారని నిలదీశారు.  ఈటల రాజేందర్ ను అడ్డుతొలగించుకునేందుకే సీఎం కాగ్ నివేదికను అడ్డుపెట్టుకుంటున్నారని ఆరోపించారు. సింగరేణిని ముంచిన అధికారిని తిరిగి ఆర్థిక కార్యదర్శిగా తీసుకున్నారని విమర్శించారు. ఎఫ్.ఆర్.బి.ఎం. నిబంధనల ప్రకారం 3.5 శాతం మించి అప్పులు తేవడం సాధ్యం కాకపోయినా.. ఇప్పుడు 4.8 అప్పులు తెచ్చారని తెలిపారు. వీటిపై వివరాలు సేకరించి విచారణ సంస్థకు కాంగ్రెస్ పిర్యాదు చేస్తుందని హెచ్చరించారు.