కేసిఆర్ ను ఓడగొట్టి టిఆర్ఎస్ పార్టీని గద్దె దింపడం అనే ఏకైక లక్ష్యంతో రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరి ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకుని రెండు నెలలు గడుస్తున్నది. ఇప్పుడు కాంగ్రెస్ లో రేవంత్ ఎలా ఉన్నారు? కాంగ్రెస్ మార్కు రాజకీయాలను రేవంత్ ఒంటపట్టించుకున్నారా? లేకపోతే కాంగ్రెస్ లోకి వచ్చి ఇబ్బందులు పడుతున్నాని అనుకుంటున్నారా? చదవండి స్టోరీ.

ఓటుకు నోటు కేసు తర్వాత రేవంత్ సింగిల్ ఎజెండా కేసిఆర్ ను గద్దె దింపడమే. అందుకోసమే ఆయన ప్రతి ఎత్తుగడ కూడా ఉంటున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీలో ఉంటే ఆ దిశగా ప్రయాణం సక్సెస్ కాదన్న ఉద్దేశంతోనే రేవంత్ టిడిపి కి గుడ్ బై చెప్పారు. నిజానికి తెలంగాణ తెలుగుదేశం పార్టీలో రేవంత్ ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా సాగింది. రేవంత్ కు పార్టీలో పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు అధినేత చంద్రబాబు. దీంతో మూడున్నరేళ్ల పాటు రేవంత్ అధికార టిఆర్ఎస్ పార్టీ మీద రెచ్చిపోయారు. అధికార పార్టీ కదలికలను అడుగడుగునా ఎండగట్టారు. కేసిఆర్ ను ధీటుగా ఎదుర్కోవడంలో హేమాహేమీలే కింద మీద అయిన పరిస్థితుల్లో రేవంత్ కేసిఆర్ కు ధీటైన ప్రత్యర్థిగా నిలిచే ప్రయత్నం చేశారు. టిడిపిలో సీనియర్లు ఉన్నా.. సైలెంట్ గా ఉండడంతో ఆ పార్టీలో రేవంత్ ఇష్టారాజ్యం సాగింది. ఒకవేళ సీనియర్లు ఏమైనా కలగజేసుకున్నా.. వాళ్లను పార్టీ అధినేత చంద్రబాబు కంట్రోల్ చేసేవారు. దీంతో రేవంత్ కు టిడిపి అనే పార్టీ తెలంగాణలో కీలక నేతగా ఎదిగేందుకు మెట్టు మాదిరిగా ఉపయోగపడింది. అయితే తన లక్ష్యం చేరాలంటే రేవంత్ కు టిడిపి చాలదన్న ఉద్దేశంతోనే ఆయన పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిపోయారు.

ఇక కాంగ్రెస్ లోకి రాగానే రేవంత్ కు అసలు తత్వం బోధపడిందంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రెస్ మీట్ పెట్టాలన్నా.. సవాలక్ష అనుమతులు, సవాలక్ష అడ్డంకులు ఉంటున్నాయి. దీంతో రేవంత్ స్వేచ్ఛ కోల్పోయిన పక్షి మాదిరిగా తయారయ్యారని పార్టీలో చర్చ మొదలైంది. ఒకవేళ ఏదైనా సబ్జెక్టు ఎంచుకుని ప్రెస్ మీట్ పెట్టాలంటే.. అధిష్టానం నుంచి అనుమతి వచ్చే పరిస్థితులు లేవని రేవంత్ సన్నిహితులు వాపోతున్నారు. కాకలు తీరిన నేతలున్న కాంగ్రెస్ పార్టీకి.. చిన్న లీడర్లున్న తెలుగుదేశం పార్టీకి మధ్య తేడా ఆమాత్రం ఉండదా అని కాంగ్రెస్ పెద్ద నేతలు అంటున్నారు. టిడిపిలో ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో అక్కడ మంచి మైలేజ్ తెచ్చుకున్నారు రేవంత్. కానీ.. కాంగ్రెస్ లో అడుగడుగునా కాలు పట్టి గుంజి కింద పడేసే లీడర్ల సంఖ్య చాలా ఉంటుంది అని ఇప్పుడిప్పుడే ఆయనకు అర్థమవుతోందట.

రేవంత్ పార్టీ మారగానే తాను రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తానని తన సన్నిహితుల వద్ద చర్చించారు. వారమో.. రెండు వారాలో గడిచిన తర్వాత తనకు పాదయాత్ర చేసే స్వేచ్ఛ రావొచ్చని ఆశించారు. కానీ రెండు నెలలు గడుస్తున్నా.. ఇంకా పాదయాత్రపై రేవంత్ కు స్పష్టత రాలేదు. అసలు పాదయాత్రకు అనుమతి వస్తుందా రాదా అన్న ఆందోళన కూడా నెలకొంది. కాకలు తీరిన కోమటిరెడ్డి నెలల తరబడి ప్రయత్నాలు చేసినా.. అధిష్టానం పాదయాత్రకు నో చెప్పింది. అయితే పాదయాత్ర ఒక్క రేవంత్ మాత్రమే కాదు, మరో ఇద్దరు నేతలు కూడా చేస్తారన్న ప్రచారం పార్టీలో సాగుతోంది. తాజాగా సీన్ లోకి గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ కూడా ఎంటర్ అయ్యారు. తనకు కూడా పాదయాత్ర చేసే వెసులుబాటు ఇవ్వాలని ఆమె అధిష్టానం వద్ద రిక్వెస్టు పెట్టేశారు. ఇప్పటికే రేవంత్, మల్లు బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ ముగ్గురూ పాదయారత చేసే చాన్స్ ఉందంటున్నారు. ఇప్పుడు డికె అరుణ కూడా వచ్చి చేరారు. దీంతో పాదయాత్రలు ప్రహాసనంగా మారుతాయా అన్న ఆందోళన రేవంత్ శిబిరంలో నెలకొంది.

శనివారం రేవంత్ అన్న కొడుకు వివాహం హైదరాబాద్ లో జరగనుంది. ఆ పెళ్లి రేవంత్ చేతులమీదుగానే జరిపిస్తున్నారు. (రేవంత్ సోదరుడు మరణించారు) శనివారం వరకు పెళ్లి హడావిడిలో ఉన్నారు కాబట్టి పెళ్లి తర్వాత తన పాదయాత్రతోపాటు మిగతా అన్ని అంశాలపై క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేస్తామని అంటున్నారు రేవంత్ సన్నిహితులు. ఇక పార్టీలో చేరి ఇంతకాలమైనా రేవంత్ కు ఏ రకమైన పదవి కూడా రాలేదు. ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి ఇస్తారని ముందుగా ఊహాగానాలు నడిచాయి. కానీ ఇప్పుడప్పుడే ఆ పదవి వస్తుందా లేదా అన్న క్లారిటీ లేదు. ఒకవేళ రేవంత్ కు పదవి ఇస్తే ఆ మేరకు కాంగ్రెస్ పార్టీని డ్యామేజీ చేసేందుకు కొంతమంది కాంగ్రెస్ పెద్ద నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టిఆర్ఎస్ లో చేరవచ్చన్న ప్రచారం కూడా సాగుతోంది. ఈ తరుణంలో ఇటు రేవంత్ కానీ.. అటు కాంగ్రెస్ అధిష్టానం కానీ.. ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి నెలకొందని పాలమూరుకు చెందిన ఒక కాంగ్రెస్ సీనియర్ నేత ఏషియానెట్ కు వెల్లడించారు. తొందరపడితే అసలుకే మోసం రావొచ్చు కదా అని ఆయన వ్యాఖ్యానించారు.

మొత్తానికి టిడిపిలో స్వేచ్ఛ అనుభవించిన రేవంత్ కు కాంగ్రెస్ లో కట్టడి చేస్తున్న పరిస్థితులు మాత్రం ఉన్నాయని చెబుతున్నారు.