ఆ ముగ్గురినీ ముగ్గులోకి గుంజిన రేవంత్

revanth drags another three mlas into defection controversy
Highlights

  • కొత్తగా మరో ముగ్గురిని టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి
  • ఢిల్లీ వేదికగా దాడి తీవ్రం చేసిన రేవంత్

టిఆర్ఎస్ పార్టీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ప్రత్యర్థుల జాబితాలో రేవంత్ రెడ్డి తొలి స్థానంలో నిలుస్తారు. ఆయన ఎప్పుడు ఏ నాయకుడికి ఎసరు పెడతారోనని పార్టీ నేతలు ఆందోళన చెందుతున్న వాతావరణం నెలకొంది. కొన్ని సందర్భాల్లో అయితే రేవంత్ దాడికి టిఆర్ఎస్ నేతల నుంచి సమాధానం కూడా చెప్పలేని సంకట స్థితికి నెట్టబడుతున్న పరిస్థితి ఉంది. తాజాగా ముగ్గురు ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి ముగ్గులోకి దింపడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఎవరా ముగ్గురు ఏమిటా ముచ్చట అన్నది తెలియాలంటే ఈ స్టోరీ ఆసాంతం లాంగిచేయండి మరి.

రేవంత్ రెడ్డి టిడిపిలో ఉన్నా.. కాంగ్రెస్ లో చేరినా.. అధికార పార్టీ వారిని చెడుగుడు ఆడుతున్నారు. సిఎం కేసిఆర్ పైనా, ఆయన తనయుడు మంత్రి కేటిఆర్ పైనా పరుషమైన విమర్శల దాడి చేస్తున్నారు. మంత్రి కేటిఆర్ అసలు పేరు అజయ్ అన్న విషయాన్ని రేవంత్ బయటపెట్టారు. దానికి టిఆర్ఎస్ నుంచి సమాధానం లేదు. తర్వాత మంత్రి కేటిఆర్ మామ ఎస్టీ సర్టిఫికెట్ మీద ఉద్యోగం సంపాదించారని ఆరోపించారు. దానికి కూడా టిఆర్ఎస్ నుంచి సమాధానం లేదు. మరోసారి మంత్రి కేటిఆర్ బామ్మార్ది రాజేంద్ర ప్రసాద్ పాకాల డ్రగ్ మాఫియా డాన్ గా చెలామణి అవుతున్నారని, రాజ్ పాకాల భార్య సుమ పాకాల కూడా డ్రగ్ మాఫియాలో నిమగ్నమయ్యారని ఆరోపించారు. దీనిపై రాజ్ పాకాల లీగల్ నోటీసులు ఇచ్చారు తప్ప.. తదుపరి రేవంత్ విమర్శలను బలంగా తిప్పికొట్టిందేమీ లేదు. దీనికితోడు మంత్రి లక్ష్మారెడ్డి డాక్టర్ పట్టా వ్యవహారంలోనూ తీవ్రమైన విమర్శలు గుప్పంచారు. వీటన్నింటిలో ఏ ఒక్కదానిపైనా టిఆర్ఎస్ నుంచి సమాధానం రాలేదు. కౌంటర్ ఇచ్చే పని కూడ చేయలేదు. దానికి కారణం అధికార పార్టీ నుంచి వస్తున్న మాటేమిటంటే..? రేవంత్ కు విశ్వసనీయ లేదు.. ఓటుకు నోటు కేసులో క్రెడిబులిటీ పోగొట్టుకున్నాడు కాబట్టి ఆయన మాటలు లైట్ తీసుకుంటామని చెబుతున్నారు.

తాజా విషయాల్లోకి వస్తే.. ఢిల్లీలో 20 మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. లాభదాయక పదవుల్లో కొనసాగిన (పార్లమెంటరీ కార్యదర్శులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేశారన్న ఆరోపణలు) ఆరోపణలతో వేటు పడింది. ఈ విషయమై తెలంగాణలోనూ పార్లమెంటరీ సెక్రటరీలుగా ఆరుగురు ఎమ్మెల్యేలు పనిచేశారని, వారిపైనా సస్పెన్షన్ వేటు వేయాలని రేవంత్ కోరుతున్నారు. దీనిపై ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్రపతికి ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదులు కూడా చేశారు. గతంలో వీరి నియామకంపై హైకోర్టులో కేసు వేసి సర్కారును ఓడగొట్టారు రేవంత్ రెడ్డి. అంతిమంగా వాళ్ల పదవులు ఊడిపోయాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ వివాదంలోకి మరో ముగ్గురిని గుంజుకొచ్చారు రేవంత్. వాళ్లెవరు.. వాళ్లు ముచ్చట కింద చదవండి.

పార్లమెంటరీ సెక్రటరీల జిఓను కొట్టివేస్తూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రానున్న రోజుల్లో ఇలాంటి నియామకాలు చేయాలంటే న్యాయస్థానానికి సమాచారం ఇచ్చి చేపట్టాలని ఆదేశించింది. అయితే న్యాయస్థానం ఇచ్చిన సూచనను ఏమాత్రం పట్టించుకోకుండా మరో అనంతర కాలంలో మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా కల్పించారని, అది రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని రేవంత్ వాదిస్తున్నారు. ఆ ముగ్గురిలో ఒకరు సాంస్కృతిక విభాగం ఛైర్మన్ రసమయి బాలకిషన్, ఆర్టీసి ఛైర్మన్ సోమారపు సత్యనారాయణ, మిషన్ భగీరథ వైస్ ఛైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి ల మీద కూడా రేవంత్ బాణం ఎక్కు పెట్టారు. గతంలో పార్లమెంటరీ సెక్రటరీలుగా పనిచేసిన ఆరుగురితోపాటు కొత్తగా ఈ ముగ్గురిపై కూడా  వేటు పడాల్సిందే అని రేవంత్ డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్రపతికి రాసిన ఫిర్యాదుల్లో వీళ్ల పేర్లును కూడా జత చేశారు. ఢిల్లీ వేదికగా టిఆర్ఎస్ లోని 9 మంది  ఎమ్మెల్యేలపై దాడి తీవ్రత పెంచారు రేవంత్. దీంతో వారిలో టెన్షన్ తీవ్రమైతున్నది. 

మొత్తానికి ఆప్ ఎమ్మెల్యేలపై నిర్ణయం వెలువడిన తరుణంలో గుట్కు మిట్కు అన్నట్లు బతుకుతున్న టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రేవంత్ చర్యలు పుండు మీద కారం పూసినట్లుగా ఉన్నాయని చర్చ జరుగుతోంది. ఈ విషయంలో ఢిల్లీకి వెళ్లి మరీ.. ఆ ఆరుగురితోపాటు ఈ ముగ్గురిపైనా వేటు వేయించేందుకు రేవంత్ రెడీ అయిపోయారు.

loader