వంట మనిషి కుమారుడు కలెక్టర్ కాబోతున్నారు.. సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటిన పేదింటి బిడ్డ రేవయ్య..
మంగళవారం విడుదలైన సివిల్స్ ఫలితాల్లో కుమురం భీం జిల్లాకు చెందిన రేవయ్య 410 ర్యాంకు సాధించారు. ఆయన తల్లి ప్రభుత్వ పాఠశాలలో వంట మనిషిగా పని చేస్తున్నారు. ఓఎన్ జీసీలో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి ఆయన సివిల్స్ కు సిద్ధమయ్యారు.
కుమురం భీం జిల్లాకు చెందిన ఓ పేదింటి బిడ్డ కలెక్టర్ కాబోతున్నారు. వంట మనిషి కుమారుడు సివిల్ సర్వీస్ అధికారిగా సేవలు అందించబోతున్నారు. మంగళవారం విడుదలైన సివిల్స్ ఫలితాల్లో రెబ్బెన మండలంలోని తుంగెడ గ్రామానికి డోంగ్రి రేవయ్య సత్తా చాటారు. ఆల్ ఇండియా స్థాయిలో 410 ర్యాంక్ సాధించారు.
దారుణం.. ఫారెస్టు గార్డును కాల్చి చంపిన వేటగాళ్లు.. సిమిలిపాల్ టైగర్ రిజర్వ్‌లో ఘటన
సవాలక్ష సవాళ్లు ఉన్న వాటినన్నింటిని అధిగమించి తన కలను సాధించారు రేవయ్య. ఆయన తండ్రి మనోహర్ చిన్నతనంలోనే చనిపోయారు. తల్లి విస్తారుబాయి ఒక్కరే స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికురాలిగా పని చేస్తూ రేవయ్యను, అతడి సోదరుడు శ్రావణ్‌కుమార్, సోదరి స్వప్నను పెంచారు. తల్లి పడుతున్న కష్టాన్ని చూస్తూ పెరిగిన రేవయ్య చదువులో ఎప్పుడూ ప్రతిభ కనబర్చేవారు.
టెన్త్ క్లాస్ వరకు ఆసిఫాబాద్ రెసిడెన్షియల్ స్కూల్ చదివారు. చిలుకూరులోని సోషల్ వెల్పేర్ హాస్టల్ లో ఉంటూ ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. 2012 సంవత్సరంలో ఐఐటీ ఎంట్రెన్స్ రాసి ప్రతిభ కనబర్చారు. అందులో 737 ర్యాంకు సాధించారు. దీంతో మద్రాసు ఐఐటీలో సీటు లభించింది. అక్కడ ఆయన కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. తరువాత ఓఎన్‌జీసీలో 5 సంవత్సరాల పాటు ఎగ్జిక్యూటివ్ ఇంజినీరుగా ఉద్యోగం చేశారు.
సివిల్ సర్వీస్ అధికారిగా మారి ప్రజలకు సేవలు అందించాలనే లక్ష్యంతో రేవయ్య తన ఉద్యోగాన్ని వదిలిపెట్టారు. సివిల్స్ కు సిద్ధమవడం ప్రారంభించారు. ఈ క్రమంలో గతేడాది విడుదలైన సివిల్స్ ఫలితాల్లో రెండు మార్కుల తేడాతో అవకాశం చేజారింది. అయినా వెనకడుగు వేయకుండా, అధైర్య పడకుండా మళ్లీ పరీక్షకు సిద్ధమయ్యారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో విజయం సాధించారు. సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అతడికి 410వ ర్యాంక్ వచ్చింది. దీంతో ఆయన గ్రామం ఒక్క సారిగా వార్తల్లో నిలిచింది.
ఢిల్లీ కోర్టును అభ్యర్థించిన రాహుల్ గాంధీ.. అసలేం జరిగిందంటే.?
ఈ విజయానికి తన తల్లే కారణమని ఆయన చెప్పారు. ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ తన తల్లి మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. తన ఆశయ సాధనకు గట్టి పట్టుదల, అంకితభావం కూడా కారణమని చెప్పారు. సివిల్స్ సర్వీస్ అధికారిగా మారి పేదలకు సేవలందిస్తానని తెలిపారు. కాగా రేవయ్యకు వచ్చిన ర్యాంకు ఆధారంగా, రిజర్వేషన్ ప్రతిపాదికన ఐఏఎస్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.