Asianet News TeluguAsianet News Telugu

మునుగోడు ఉపఎన్నిక రద్దు చేయండి.. కౌంటింగ్‌కు ముందు రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి సంచలనం

మునుగోడు ఉపఎన్నికను రద్దు చేయాలని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్, బీజేపీలు ప్రజస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని.. ఇలాంటి పనులను ఇకనైనా కట్టిపెట్టాలని మురళీ కోరారు. 

retired ias akunuri murali demands cancel munugode bypoll
Author
First Published Nov 5, 2022, 9:31 PM IST

తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో తీవ్ర ఉత్కంఠ కలిగించిన మునుగోడు ఉపఎన్నిక ఫలితం మరికొద్దిగంటల్లో తేలనున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్ధితుల నేపథ్యంలో రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉపఎన్నికను రద్దు చేయాలని ఆయన ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. మునుగోడు ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్, బీజేపీలు ఓటర్లకు డబ్బులు పంచాయని.. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో కూడా వచ్చాయని మురళి తెలిపారు. దీనిని పరిగణనలోనికి తీసుకుని ఎన్నికను రద్దు చేయాలని ఆయన కోరారు. టీఆర్ఎస్, బీజేపీలు ప్రజస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని.. ఇలాంటి పనులను ఇకనైనా కట్టిపెట్టాలని మురళీ కోరారు. 

ఇకపోతే.. మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నిక ఓట్ల లెక్కింపును ఆదివారం (నవంబర్ 6) చేపట్టనున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. నల్గొండ జిల్లా అర్జాలబావిలోని వేర్ హౌసింగ్ గోడౌన్స్​లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఉదయం 7గంటలకు  పోలింగ్ ఏజెంట్లు, అభ్యర్థుల సమక్షంలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయనున్నారు. అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. 

ALso REad:రేపే మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్.. విస్తృత ఏర్పాట్లు చేసిన ఈసీ.. మధ్యాహ్నం లోపే తుది ఫలితం..!

ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం అధికారులు 21 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 15 రౌండ్ల కౌంటింగ్ ఉంటుంది. 21 పోలింగ్‌ కేంద్రాల్లో పోలైన ఓట్లను ఒక్కో రౌండ్‌లో లెక్కించనున్నారు. ఇక, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు తెరవడానికి ముందు అధికారులు పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. మొత్తం 686 పోస్టల్ బ్యాలెట్లు లెక్కించిన తర్వాత.. ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభం కానుంది. 

జిల్లా ఎన్నికల అధికారి వినయ్ కృష్ణా రెడ్డి, ఆర్​ఓ రోహిత్ సింగ్, కేంద్రం నుంచి వచ్చిన ముగ్గురు పరిశీలకుల పర్యవేక్షణలో కౌంటింగ్ ప్రక్రియ జరుగనుంది.  ఒక్కో టేబుల్​కు కౌంటింగ్ సూపర్​వైజర్​,అసిస్టెంట్ సూపర్​వైజర్, మైక్రో అబ్జర్వర్లను నియమించారు. ఉపఎన్నిక పోరులో 47 మంది అభ్యర్థులు బరిలో ఉన్నందున కౌంటింగ్ కేంద్రం వద్ద కౌంటింగ్ ఏజెంట్లందరికీ బస చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. తగిన భద్రతా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ మొత్తం ప్రక్రియ వీడియో గ్రాఫ్ చేయబడుతుంది. ఉదయం 9 గంటల కల్లా తొలి ఫలితం వచ్చే అవకాశం ఉంది. తుది ఫలితం మధ్యాహ్నాం ఒంటిగంట కల్లా వచ్చే అవకాశముంది. తొలుత చౌటుప్పల్ మండల ఓట్లను లెక్కించనున్నారు. తర్వాత నారాయణపురం, మునుగోడు, చండూరు, మర్రిగూడెం, నాంపల్లి, గట్టుప్పుల్​ మండలాల ఓట్లను లెక్కిస్తారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios