గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ రాజ్‌భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను గవర్నర్ తమిళిసై సత్కరించారు.

తెలంగాణ రాజ్‌భవన్‌లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ సత్కరించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, సినీ గేయ రచయిత చంద్రబోస్, ఎన్జీవో భగవాన్ మహవీర్ వికలాంగ సహాయతా సమితి, పారా అథ్లెట్ కుడుముల లోకేశ్వరి, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆకుల శ్రీజ, సివిల్స్ శిక్షకురాలు బాలలతలను గవర్నర్ తమిళిసౌ సన్మానించారు. వారిని శాలువతో సత్కరించి ప్రశంసా పత్రం, జ్ఞాపికను కూడా అందజేశారు. 

అయితే ఆకుల శ్రీజ రాలేకపోవడంతో ఆమె తల్లిదండ్రులు గవర్నర్ నుంచి ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. ఇక, సివిల్స్ శిక్షకురాలు బాలలతకు సన్మానం చేసే సమయంలో వేదికపై నుంచి దిగి ఆమె ఉన్నచోటుకే గవర్నర్ వచ్చారు. ఇక, అనంతరం కీరవాణి మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘనత తన ఒక్కడిది కాదని అన్నారు. ఇది తన గురువులు, సోదరులు, మద్దతుదారులందరి విజయం అని పేర్కొన్నారు.

Scroll to load tweet…

ఇక, కీరవాణి సంగీతం అందించిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ పాట ప్రఖ్యాత గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా.. రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవ పాడారు. తాజాగా ఈ పాట.. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో ఆస్కార్‌కు నామినేట్ అయింది.