తెలంగాణ లోని మంచిర్యాలలో దారుణం జరిగింది. తల్లి క్షణికావేశంతో అభం శుభం తెలియని చిన్నారులు అనాథలుగా మారారు. కుటుంబ కలహాలతో వివాహిత బలవన్మరణానికి పాల్పడిన సంఘటన ఆదివారం దండేపల్లిలో చోటుచేసుకుంది. 

దురలవాట్లు మానుకోలేకపోవడం.. మంచి చెబితే ఇబ్బంది పడడం చివరికి ఆ వివాహిత ప్రాణాల మీదికి తీసుకువచ్చింది. చిన్నారుల భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చేసింది. ఇద్దరు చిన్నారులు తల్లి ప్రేమకు దూరమయ్యేలా చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  దండేపల్లి కి చెందిన సత్యనారాయణకు గద్దె రాగడికి చెందిన జ్యోతి(30)తో 2012లో వివాహం అయింది.

వీరికి శశ్మిత, హర్షిణి అని ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అయితే మృతురాలు జ్యోతికి తంబాకు తినే అలవాటు ఉంది. ఈ అలవాటు మంచిది కాదు, మానుకోవాలని భర్త, అత్త తరచుగా చెబుతూ వస్తున్నారు. కానీ జ్యోతి మానుకోలేకపోయింది. 

దీంతో ఈ విషయం లో కుటుంబంలో మనస్పర్థలు ఏర్పడ్డాయి. తంబాకు విషయంలోనే శనివారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య చిన్న గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన జ్యోతి ఆదివారం పిల్లలను పక్కింటికి పంపి, ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

మృతురాలి సోదరుడు రంజిత్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ వెల్లడించారు.  జ్యోతి మరణంతో ఇద్దరు చిన్నారులు తల్లి ప్రేమకు దూరమయ్యారు. ఊరికి వేలాడుతున్న తల్లి ని చూసి ఇద్దరు చిన్నారులు అమ్మా, అమ్మా.. అని ఏడవడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.