హైదరాబాద్: తెలంగాణలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ కోసం ఆన్ లైన్ స్లాట్ బుకింగ్  సర్వీస్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ శుక్రవారం నాడు ప్రారంభించారు.

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఈ విషయమై ఆన్ లైన్ లో స్లాట్ బుక్ చేసుకోవాలని హైకోర్టు గురువారం నాడు ఆదేశించిన విషయం తెలిసిందే.

also read:ధరణి: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

దీంతో శుక్రవారం నాడు రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖ అధికారులతో సీఎస్ సోమేష్ కుమార్ సమావేశమయ్యారు. ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ ప్రక్రియను సోమేష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆన్‌లైన్ బుకింగ్ ను ప్రారంభించినట్టుగా చెప్పారు. 96 శాతం సర్వీసులు ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయన్నారు.

స్లాట్ బుక్ చేసుకోగానే డాక్యుమెంట్స్ కోసం సమాచారం పంపుతారని ఆయన చెప్పారు. ఈ ప్రక్రియ కోసం కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేసినట్టుగా ఆయన చెప్పారు.

ఒక్క  సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఒక్కరోజు 24 స్లాట్లు మాత్రమే బుక్ చేసుకోవచ్చన్నారు. ఆధార్ నెంబర్ ఇవ్వని వారి కోసం ఇతర ఏర్పాట్లు చేశామన్నారు.


ఎల్ఆర్ఎస్ లేని వారి విషయంలో కూడ త్వరలోనే నిర్ణయం తీసుకొంటామన్నారు. ఇళ్లు, ప్లాట్లతో పాటు ఓపెన్ ప్లాట్లు కూడ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. గతంలో 16 లక్షల లావాదేవీలు జరిగితే వాటిలో 10 వేలు మాత్రమే స్లాట్ బుకింగ్ ద్వారా జరిగేవన్నారు. 

రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు 100 మంది అధికారులు, నిపుణులతో బీర్‌కే భవన్ లో వార్ రూం ఏర్పాటు చేశామన్నారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించి 24 గంటలు కాల్ సెంటర్ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.