తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు పాత పద్ధతిలోనే జరగనునున్నాయి. ఎల్లుండి నుంచి ఈ ప్రక్రియ తిరిగి ప్రారంభం కానుంది. కార్డ్‌ (సి.ఎ.ఆర్‌.డి) విధానంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల ద్వారా జరగనున్నాయి.

దీంతో ధరణి ద్వారా వ్యవసాయేతర ఆస్తులకు స్లాట్‌ బుకింగ్‌ నిలిపివేయబడింది. ఇప్పటికే స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారికి యథాతథంగా రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. ఈ మేరకు సోమవారం నుంచి అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌లకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. స్లాట్ బుకింగ్‌లు ఎవరూ అడగవద్దని, కార్డు పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయని కేసీఆర్ తెలిపారు.

రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగంగా కొనసాగాలని.. ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకూడదని కేసీఆర్ చెప్పారు. కొత్త పద్ధతిలో 1,760 రిజిస్ట్రేషన్‌లను పూర్తి చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. కొత్త విధానంలో 2,599 మంది స్లాట్ బుకింగ్స్ చేసుకున్నారని తెలిపారు.