ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఓ ప్రభుత్వ కార్యక్రమంలో రేగా కాంతారావు మాట్లాడుతుండగా పార్టీ ప్రస్తావన తేవడంతో పొడెం వీరయ్య అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే రాష్ట్ర మంత్రి ఇందకరణ్ రెడ్డి సమక్షంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. వివరాలు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలోని లక్ష్మినగరంలో బుధవవారం తునికి ఆకుల సేకరణ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, పోదెం వీరయ్యలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రేగా కాంతారావు సీఎం కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. మళ్లీ తమ పార్టీనే అధికారంలోకి వస్తుందని అన్నారు. అయితే రేగా కాంతారావు పార్టీ ప్రస్తావన తేవడంతో రేగా కాంతారావును పోదెం వీరయ్య అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువురు నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే ఇద్దరు నేతల మధ్య వాగ్వాదం సమయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోయారు. 

ఇక, వేదికపైనే రేగా కాంతారావు, ఎమ్మెల్యే పోదెం వీరయ్యలు.. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఒకరిపై ఒకరు దూషణలకు దిగారు. అయితే వెంటనే అక్కడున్నవారు, పోలీసులు జోక్యం చేసుకుని వివాదం సద్దుమణిగేలా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.