దేశంలోనే అత్యధికంగా క్వింటా మిర్చీ  రూ. 52,000కి పలకడం గమనార్హం. దీంతో.. మిర్చీ కూడా బంగారంతో పోటీపడుతోందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండించే పంటల్లో మిర్చీ ఒకటి. కాగా.. ఈ ఏడాది మిర్చీ కి భారీ ధర పలుకుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోని హన్మకొండ జిల్లాలోని ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ అయిన ఎనుమాముల వద్ద బుధవారం మిర్చీ ధర భారీగా పలికింది. దేశంలోనే అత్యధికంగా క్వింటా మిర్చీ రూ. 52,000కి పలకడం గమనార్హం. దీంతో.. మిర్చీ కూడా బంగారంతో పోటీపడుతోందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో మిర్చికి విపరీతమైన డిమాండ్‌ నెలకొనడంతో గత నెల రోజులుగా మిర్చి ధరలు అమాంతం పెరిగాయి.
ములుగు జిల్లా ములుగు మండలం ఎస్ .నగర్ గ్రామానికి చెందిన బలుగూరి రాజేశ్వరరావు అనే రైతు బుధవారం ఎనుమాముల మార్కెట్ కు ఏడు బస్తాల ఎర్ర మిర్చి తీసుకొచ్చాడు. చివరకు క్వింటాల్‌కు ₹ 52,000 పలికిన వేలంలో అతని మిర్చిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఒకరితో ఒకరు పోటీ పడ్డారు.

గతేడాది ఎకరాకు 20-30 క్వింటాళ్ల దిగుబడి వచ్చినప్పటికీ రైతులకు క్వింటాల్‌కు ₹ 8,000 నుండి ₹ 9,000 మధ్య ధర లభించింది. ఈ సంవత్సరం, చాలా మంది మిర్చి రైతులు ఎకరాకు 4-5 క్వింటాళ్లు మాత్రమే పండించగలిగారు, కొత్త రకం తెగులు దాడి , ఆకస్మికంగా ఊహించని వర్షాలు వంటి అనేక కారణాల వల్ల. కానీ వారి ఉత్పత్తుల ధరలు పెరిగాయి. పంట బాగా వచ్చినప్పుడు ధర లేకుండా పోయిందని.. ఈ ఏడాది పంట సరిగా పండకపోయే సరికి ధర బాగా పలుకుతోందని వారు చెబుతున్నారు. రేటు తమకు అనుకూలంగా ఉన్నప్పటికీ.. దిగుబడి తక్కువగా ఉండడంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.