హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సీపీఐ మద్దతు కోసం టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కోరినట్టుగా గులాబీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర రాజకీయ సమీకరణాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకొనే అవకాశాలు ఉన్నాయని  విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ నెల 21వ తేదీన హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో  టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డికి సీపీఐ మద్దతు ప్రకటించింది.ఈ నియోజకవర్గంలో  సీపీఐకు కనీసంగా 10వేల ఓటు బ్యాంకు ఉంటుందని అంచనా. దీంతో ఈ పార్టీ మద్దతును టీఆర్ఎస్ కోరింది.

హుజూర్‌నగర్ అసెంబ్లీ ఎన్నికలకే కాకుండా రానున్న రోజుల్లో కూడ సీపీఐ, టీఆర్ఎస్ ల మధ్య  స్నేహం కొనసాగే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు రెండు పార్టీల్లో వ్యక్తమౌతున్నాయి.

రాష్ట్రంలో  గులాబీ దళపతికి బీజేపీ నుండి  ప్రమాదం పొంచి ఉంది. రాష్ట్రంలో బలోపేతం కావడం కోసం బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకొంటుంది. తెలంగాణలో నాలుగు ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవడంతో  బీజేపీ జాతీయ నాయకత్వం కూడ తెలంగాణపై కేంద్రీకరించింది.

దీంతో బీజేపీని నిలువరించేందుకు కమ్యూనిష్టుల తోడ్పాటు తీసుకోవాలని కేసీఆర్  భావించారని అందులో భాగంగానే హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో సీపీఐ పొత్తును కోరినట్టుగా చర్చ కూడ ఉంది.

హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సీపీఐతో  ప్రారంభమైన  పొత్తు భవిష్యత్తులో కూడ కొనసాగే అవకాశం లేకపోలేదని టీఆర్ఎస్ వర్గాలు అభిప్రాయంతో ఉన్నాయి. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కూడ సీపీఐ, టీఆర్ఎస్ మధ్య పొత్తులు కొనసాగే అవకాశం ఉంది.

బీజేపీని అడ్డుకోవాలంటే సిద్దాంతపరంగా కమ్యూనిష్టులతో కలిసి పనిచేస్తే రాజకీయంగా తమకు ప్రయోజనం ఉంటుందని కేసీఆర్ లెక్కలు వేసుకొంటున్నారనే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వచ్చే ఎన్నికల నాటికి బీజేపీని నిలువరించాలంటే కమ్యూనిష్టులతో మితృత్వం అవసరమని భావించి కేసీఆర్ హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలను వేదికగా ఎంచుకొన్నారనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

గత ఎన్నికల్లో  సీపీఐ, కాంగ్రెస్, తెలంగాణ జనసమితి, టీడీపీ ప్రజా కూటమి(మహాకూటమి)గా పోటీ చేశాయి. అయినా ఈ కూటమి పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే రానున్న రోజుల్లో  సీపీఐతో పాటు ఇతర కమ్యూనిష్టు పార్టీలను కూడ గులాబీ బాస్  కలుపుకుపోతారా లేదా అనే విషయమై చర్చ కూడ సాగుతోంది.

సంబంధిత వార్తలు

టీఆర్ఎస్ తెలివైన అడుగు: హుజూర్ నగర్ లో సిపిఐ బలం ఇదీ....