Asianet News TeluguAsianet News Telugu

హుజూర్ నగర్ ఉపఎన్నిక: కారు వెనక సీట్లో సిపిఐ ఎందుకంటే..

సిపిఐ తమ అస్థిత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందుకోసం ఏ ఎన్నికల్లోనైనా పోటీ మాత్రమే చేస్తే సరిపోదు. సీట్లను కూడా గెలవాలి. అప్పుడే పార్టీకి మనుగడ ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించిన సిపిఐ ఆ దిశలోనే అడుగులు వేస్తుంది. 

reasons behind cpi supporting trs
Author
Hyderabad, First Published Oct 1, 2019, 4:25 PM IST

హైదరాబాద్: హుజూర్ నగర్ ఉప ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ ఏర్పడ్డనాటి నుంచి ఏ నాడు తెరాస ఇతరపార్టీల దగ్గరకు పొత్తుకోసం వెళ్ళింది లేదు. అసెంబ్లీ ఎన్నికల కోసం కానీ, పార్లమెంట్ ఎన్నికలప్పుడు కానీ తెరాస ఒంటరిగానే బరిలోకి దిగింది. 

దీనికి భిన్నంగా ఇప్పుడు హుజూర్ నగర్ ఉప ఎన్నిక కోసం తెరాస అగ్ర నాయకులు సిపిఐ మద్దతు కోరారు. వచ్చింది ఎవరో సాదాసీదా నాయకులు కాదు. కెసిఆర్ గారికి అత్యంత సన్నిహితుడైన వినోద్ కుమార్, పార్లమెంటులో తెరాస సభా పక్ష నేత నామా నాగేశ్వర్ రావు, ఇంకో సీనియర్ నేత కేశవ రావు. వీరంతా విలేఖరులతో మాట్లాడుతూ, తాము కెసిఆర్ ఆదేశానుసారమే వచ్చామని చెప్పారు. 

సిపిఐ తమ నిర్ణయం ఇంకొద్దిసేపట్లో ప్రకటించనుంది. సిపిఐ సీనియర్ నాయకుడు నారాయణ  ఇందాక మాట్లాడినదాన్నిబట్టి చూస్తే,తెరాస కు మద్దతు ప్రకటించేవిధంగానే కనపడుతుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస కు ప్రత్యర్థిగా మహాకూటమిలో భాగస్వామి అయిన పార్టీ ఇప్పుడెందుకిలా వ్యవహరిస్తోంది అనే డౌట్ ఖచ్చితంగా వస్తుంది. 

ఆ నిర్ణయం వెనుక విషయాలను అర్థం చేసుకునే ముందు 2019 పార్లమెంటు ఎన్నికల విషయానికి వద్దాము. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ తో పొత్తు పెట్టుకోలేదు. కేవలం మద్దతు మాత్రమే కోరింది. సిపిఐ ఒక పార్లమెంటు సీటును కోరినా దానికి కాంగ్రెస్ అంగీకరించలేదు. 

2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పొత్తులో భాగంగా, తమకు కేటాయించాల్సినన్ని సీట్లు తమకు కేటాయించలేదని సిపిఐ ఆగ్రహంగా ఉంది. దానికి తోడు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులు పూర్తిగా తమకు సహకారం అందించలేదని సిపిఐ బాహాటంగానే చెప్పింది కూడా. 

కాంగ్రెస్ తోపాటు ఇంకా ఎక్కువకాలం ప్రయాణిస్తే తమ మనుగడకే ప్రమాదం వాటిల్లేలా ఉందని భావించిన సిపిఐ కాంగ్రెస్ తోని దోస్తీని కటీఫ్ చేసుకోవడానికి సిద్ధపడింది. మరి తెరాస తో దోస్తీ ఎందుకు?

సిపిఐ తమ అస్థిత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందుకోసం ఏ ఎన్నికల్లోనైనా పోటీ మాత్రమే చేస్తే సరిపోదు. సీట్లను కూడా గెలవాలి. అప్పుడే పార్టీకి మనుగడ ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించిన సిపిఐ ఆ దిశలోనే అడుగులు వేస్తుంది. 

మునిసిపల్ ఎన్నికలు రానున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా చెప్పుకోదగ్గ స్థాయిలో  కౌన్సిలర్ సీట్లు దక్కించుకొని, కుదిరితే కొన్ని మునిసిపల్ చైర్మన్ స్థానాలు కూడా దక్కించుకోవాలని సిపిఐ భావిస్తుంది. ఇలా గెలిస్తే పార్టీలో నూతనోతేజాన్ని నింపడం సాధ్యపడుతుందని వారు భావిస్తున్నారు. 

ఇలా సిపిఐ గనుక గెలవాలంటే ఒంటరిగా పోటీ చేస్తే అది సాధ్యపడదు. అందుకోసం వారికి తెరాస సహాయం అవసరం.తెరాస తో పొత్తు పెట్టుకొని పోటీ చేస్తే సీట్లు సాధించడం సులువవుతుంది.

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు కానీ మిత్రులుగాని ఉండరనడం డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికలు తొలిసారి నిరూపిస్తే, ఇప్పుడు ఈ హుజూర్ నగర్ ఉప ఎన్నిక మరోసారి నిరూపించబోతుంది.  

Follow Us:
Download App:
  • android
  • ios