చుట్టు ప్రక్కల ఎక్కడ చూసినా ఎకరా కనీస ధర రూ.5కోట్లకు తక్కువ లేదు. గరిష్టంగా రూ. 20 కోట్లు కూడా ఉన్నది. ఈ లెక్కన వేలాది కోట్ల రూపాయలు ఒక్క దెబ్బకు హాంఫట్ అయిపోయినట్లేనా?
పెద్ద నోట్ల రద్దుతో అమరావతి ప్రాంతంలో సుమారు రూ. 10 వేల కోట్ల రియల్ ఎస్టేట్ డబ్బు హాంఫట్ అయిపోయింది. సిఆర్డిఏ పరిధిలో రియల్ ఎస్టేట్ పై పెట్టుబడులు పెట్టిన రియాల్టర్లు వేలాది కోట్లరూపాయలకు నిండా ముణిగిపోయారు. హటాత్తుగా పెద్ద నోట్లు అవ్వటంతో ఇటు రియాల్టర్లు, అటు రైతులతో పాటు ప్రభుత్వం ఆదాయంపైన కూడా భారీగానే ప్రభావం చూపుతోంది.
ఎకారలకొద్దీ లేదా ప్లాట్ల రూపంలో క్రయవిక్రయాలకు ఒప్పందాలు చేసుకుని, అడ్వాన్సులు ఇచ్చి కూర్చున్న వ్యాపారులకు ఆ మొత్తంతో పాటు మధ్యలో ఆగిపోయిన వ్యాపారాలతో పిచ్చెక్కినట్లవుతోంది. కొద్ది గంటల తేడాలో వేలాది కోట్ల రూపాయలు విలువ కలిగిన పెద్ద నోట్లు ఎందుకు పనికిరానివిగా మారిపోవటంతో వందలాది రియాల్టర్లకు తిరుక్షవరం అయిపోయింది.
సహజంగానే చాలా వ్యాపారాల్లాగే రియల ఎస్టేట్ కూడా ప్రధానంగా నల్లధనంపైననే ఆదారపడిన సంగతి అందరికీ తెలిసిందే. చేసుకున్న ఒప్పందాల్లో కొద్ది మొత్తం మాత్రమే వైట్ మనీగా చెలామణి అవుతుంది. మిగిలిని మొత్తం అంతా నల్లధనమే. అందులోనూ ఒప్పందాల సమయంలో రైతులకు ఇచ్చుకున్న కోట్లాది రూపాయల విషయం ఇక చెప్పకనే అక్కర్లేదు. అదంతా లెక్కలో లేని నల్లధనమే. మరీ నెలల క్రితమే జరిగిన ఒప్పందాల విషయంలోనైతే ఇటు డబ్బులు ఇచ్చుకున్న వ్యాపారస్తులే కాదు అటు పుచ్చుకున్న రైతులు కూడా భారీగా నష్టపోయారు.
దాంతో ఒప్పందాలను రద్దు చేసుకోవాలని రైతులు వ్యాపారస్తులపై ఒత్తిళ్ళు పెడుతున్నట్లు సమాచారం. తాము తీసుకున్న డబ్బుకు అదనంగా ఎంతో కొంత వేసి తిరిగి ఇచ్చేస్తామని రైతులు అంటున్నారు. అయితే, ఇచ్చిన అడ్వన్సులను తిరిగి తీసుకోవటానికి వ్యాపారస్తులు అంగీకరించటం లేదు. ఎందుకంటే, తీసుకున్న అడ్వన్సులను రైతులు ఇంకా తమ ఇళ్ళలోనే వుంచుకున్నారు.
ఇపుడా డబ్బును బ్యాకుల్లో జమచేయాలి. జమచేయాలంటే లెక్కలు చెప్పాలి. బయట చెల్లుబాటు కాక బ్యాకులకు లెక్కలు చెప్పలేక రైతులు అవస్తులు పడుతున్నారు. దాంతో తమకు ఇచ్చిన అడ్వాన్సును తిరిగి తీసుకోవాల్సిందిగా రైతులు ఒత్తిడి తెస్తుండటంతో వ్యాపారస్తులకు దిక్కుతోచటం లేదు.
ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ పుంజుకోవటం వెనుక ప్రధానంగా స్ధానిక వ్యక్తులకు ఎన్ఆర్ఐల మద్దతు ఉండటమే కారణం. కోట్లాది విదేశీ డబ్బును పై రెండు జిల్లాల్లో కుమ్మరించిన ఎన్ఆర్ఐలు నిండా ముణిగిపోయారు. విజయవాడ చుట్టుప్రక్కలతో పాటు, ఇబ్రహింపట్నం, గొల్లపూడి, నూజివీడు, కొల్లూరు, పెనమలూరు, పోరంకి తదితర ప్రాంతాల్లో వేలాది అపార్టుమెంట్లు నిర్మిస్తున్నారు.
మధ్యలో ఉన్న ప్రాజెక్టులన్నీ అర్ధాంతరంగా ఆగిపోయాయి. కొనుగోలు చేసిన వారు అడ్వన్సులను నల్లధనంగానే ఇచ్చి ఉంటారని ఒక అంచనా. ఇపుడదంతా వెనక్కు రాదు, ఇకముందు కట్టాల్సిన డబ్బులకు ఇబ్బందే. ఈ కారణంగానే వందలాది వెంచర్లు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఒకరకంగా నష్టపోయిన వారిలో ఎక్కువగా అధికార పార్టీకి చెందిన వారే ఉన్నట్లు సమాచారం.
అనధికారికంగా అందిన సమాచారం ప్రకారం సిఆర్డిఏ పరిధిలో సుమారు 10 వేల కోట్ల మేరకు లావాదేవీలు జరిగాయి. సుమారు 300 గ్రామాల పరిధిలో దాదాపు 20 వేల ఎకరాల మేర ఒప్పందాలు జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో రైతులకు ఇస్తున్న రెసిడెన్షియల్, కమర్షియల్ భూములు కూడా కలసి ఉన్నాయి. చుట్టు ప్రక్కల ఎక్కడ చూసినా ఎకరా కనీస ధర రూ.5కోట్లకు తక్కువ లేదు. గరిష్టంగా రూ. 20 కోట్లు కూడా ఉన్నది. ఈ లెక్కన వేలాది కోట్ల రూపాయలు ఒక్క దెబ్బకు హాంఫట్ అయిపోయినట్లేనా?
