నిజామాబాద్:  తెలంగాణ-మహారాష్ట్రకు సరిహద్దుల్లో ఉన్న  ఐదు గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా అధికారులు ప్రకటించారు. మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా నమోదౌతున్నాయి. దీంతో మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుల్లో తెలంగాణ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకొంటుంది. మహారాష్ట్ర నుండి వచ్చేవారికి పరీక్షలు నిర్వహిస్తోంది. సరిహద్దుల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసింది.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బోధన్ డివిజన్ లో ఐదు గ్రామాలను  కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు అధికారులు. ఈ గ్రామాల్లో 20 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో ఈ గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా ఆర్డీఓ ప్రకటించారు.మహారాష్ట్రకు సరిహద్దుల్లో ఉన్న జిల్లాల అధికారులను వైద్య ఆరోగ్య శాఖాధికారుల అప్రమత్తం చేశారు. మహారాష్ట్ర ప్రభావం తెలంగాణపై తీవ్రంగా ఉందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించిన విషయం తెలిసిందే.

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు గాను వచ్చే నాలుగు వారాల పాటు జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు ప్రజలను కోరారు. అవసరమైతేనే బయటకు రావాలని ఆయన కోరారు.