ఆమె రాయలసీమ గిరిజన బిడ్డ. పుట్టింది పెరిగింది అనంతపురం జిల్లాలో ఉన్న ఒక మారుమూల తాండాలో. ఐదో తరగతి వరకు సొంతూరు తండాలోనే చదివింది. 6 నుంచి 10 వరకు చిన్న పట్టణంలో చదువుకుంది. కానీ నేడు తెలంగాణ బుల్లితెర మీద అదరగొడుతున్నది. తెలంగాణ యాస, భాషతో ఔరా అనిపించుకుంటున్నది. ఇంతకూ ఎవరా అమ్మాయి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవండి.

రాయలసీమ అమ్మాయి, తెలంగాణ బుల్లి తెర అంటే మీకర్థం కాకపోవచ్చు కానీ  మంగ్లీ అన్నా.. మాటకారి మంగ్లీ అన్నా, వి6 మంగ్లీ అన్నా, తీన్మార్ మంగ్లీ అన్నా టక్కున గుర్తు పడతారు కదా?  ఆమెనే వి6 న్యూస్ చానెల్ లో తీన్మార్ వార్తల్లో తెలంగాణ భాష, యాసతో దుమ్మురేపుతున్న అమ్మాయి. అంతగా తెలంగాణ భాష మాట్లాడుతుందంటే ఆమెది కచ్చితంగా తెలంగాణ అనుకుంటరు. కానీ ఆమె సిసలైన సీమ గిరిజన బిడ్డ. ఆమె అసలు పేరు మంగ్లి కాదు సత్యవతి. మరి మాటకారి సత్యవతి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

రాయలసీమ ఆడబిడ్డలు కూడా కొంచెం ప్రోత్సాహం అందిస్తే ఎంతవరకయిన పోతారు అనడానికి ఉదాహరణ బంజారా బిడ్డ సత్యవతి జీవితమే. జానపదాలకు పుట్టినిల్లు రాయలసీమ గడ్డ. సత్యవతి పుట్టి పెరిగిన ఊరు బసినేపల్లె తాండ గుత్తి మండలం, అనంతపురం జిల్లా. ఐదో తరగి వరకు బసినేపల్లి తాండలోనే చదివింది. 6 నుంచి 10 వరకు గుత్తి పట్టణంలో చదివింది. రాయలసీమ డెవలప్ మెంట్ ట్రస్ట్ (ఆర్.డి.టి) చొరవతో సంగీతం, పాటలు పాడడం నేర్చుకుంది సత్యవతి. ఈ సంస్థ చొరవ ఆమెను ఎక్కడికో తీసుకువెళ్లిందని చెప్పాలి. ఆ సంస్థ ద్వారానే చదువుకొని పాటలు పాడటం నేర్చుకున్నది. తిరుపతి లోని సంగీత విద్యాలయం లో పూర్తి మెళకువలు నేర్చుకున్నది.

అలా మొదలైన సాహిత్య ప్రయాణంలో ఆమె వెనుదిరిగి చూడలేదు. అచ్చమైన తెలంగాణ భాష నేర్చుకున్నది. అందమైన గొంతుతో పాటలు పాడడం, తెలంగాణ గిరిజన ఆడపిల్ల మాదరిగా మాట్లాడి తెలుగు వారందరినీ మెప్పిస్తున్నది. వి6 టివిలో వచ్చే తీన్మార్ వార్తల్లో తెలంగాణ భాషలో, యాషలో అదరగొడుతున్నది సత్యవతి. శశిరేఖా పరిణయం అనే సీరియల్ లో కూడా సత్యవతి నటించి మెప్పించింది. రాయలసీమలో పుట్టిన సత్యవతి తెలంగాణ లో పల్లె పాటలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిందంటే మామూలు విషయం కాదు. మొన్నటికి మొన్న తెలంగాణ ఫార్మే షన్ డే పాట తో దుమ్ము రేపింది సత్యవతి.

చినపట్నుండే పేదరికం అనుభవించి ఒక స్వచ్ఛంద సంస్థ ద్వార చదువుకొని మంగ్లి అలియాస్ సత్యవతి ఈ స్థాయికి రావడం నిజంగా రాయలసీమ వాళ్ళే కాదు తెలుగు ప్రజలంతా గర్వించదగిన విషయమే అంటున్నారు. రాయలసీమలో పుట్టిన సత్యవతి తెలంగాణలో అదరగొట్టింది. కానీ ఇక మీదట రాయలసీమ యాస, భాషలోనూ పాటలు పాడేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో రాయలసీమ పాటలను సైతం మంగ్లీ నోట వినబోతున్నామని రాయలసీమ వాసులు సంబరపడుతున్నారు. మంగ్లీ అలియాస్ సత్యవతి వి6 టివిలో, హెచ్ఎం టివి జోర్దార్ వార్తలు అనే న్యూస్ బులిటెన్ లో కూడా పనిచేసింది. ప్రస్తుతం ఫ్రీలాన్స్ యాంకర్ గా, సింగర్ గా పనిచేస్తున్నది. 

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి