హైదరాబాద్: బీజేపీకి రావుల శ్రీధర్ రెడ్డి రాజీనామా చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుండి ఆయన బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేశారు.

ఆదివారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీజేపీకి రాజీనామా చేసినట్టుగా ఆయన ప్రకటించారు.బీజేపీ నాయకత్వం అనుసరిస్తున్న విధానాలు తెలంగాణకు చాలా నష్టం చేసేలా ఉన్నాయని శ్రీధర్ రెడ్డి విమర్శించారు. 

కార్పోరేట్ ఉద్యోగం వదులుకొని బీజేపీలో చేరిన విషయాన్ని ఆయన ఆయన గుర్తు చేసుకొన్నారు. ఏ పదవులు ఆశించి తాను బీజేపీని వీడడం లేదన్నారు. 11 ఏళ్లుగా బీజేపీకి సేవలు చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు.

తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు అగ్రస్థానంలో ఉన్నట్టుగా ఆయన తెలిపారు.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులు తెలంగాణకు శాపంగా మారబోతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. 

కొద్ది రోజులుగా బీజేపీ అనుసరిస్తున్న విధానాలు సరిగా లేవని శ్రీధర్ రెడ్డి చెప్పారు.తన రాజీనామా పత్రాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు ఆయన పంపారు. శ్రీధర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉందని సమాచారం.