కెసిఆరే నెం 1 నిలిచారు జాతీయ స్ధాయిలో రెండో సారి కూడా కెసిఆరే మొదటి స్ధానం చంద్రబాబుకు ఎనిమిదో స్ధానం
మళ్లీ కెసిఆర్ కే పట్టం దక్కింది. దేశవ్యాప్తంగా ఉత్తమ ముఖ్యమంత్రులు ఎవరనే విషయంలో జరిపిన సర్వేలో తెలంగాణా ముఖ్యమంత్రే నెంబర్ 1గా వరుసగా రెండోసారి కూడా ఎంపికయ్యారు. ముఖ్యమంత్రుల పనితీరు, ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలు, సిఎంలకున్న ప్రజాకర్షణ తదితర అంశాల ఆధారంగా ఢిల్లీకి చెందిన విడిపి అసోసియేట్స్ అనే సంస్ధ జాతీయ స్ధాయిలో సర్వే చేసింది. ఈ సంస్ధ మామూలుగా ఎన్నికల సరళి, పార్టీల స్ధితిగతులపై సర్వేలు చేస్తూ ఉంటుంది.
అదే విధంగా తాజాగా 15 రాష్ట్రాల్లోని 420 నియోజకవర్గాల్లో సర్వే జరిపింది. ఈ సర్వేలో 87 శాతం జనాధరణతో కెసిఆర్ మొదటి స్ధానంలో నిలిచారు. మొత్తం 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులపైన, ఆయా ప్రభుత్వాల పనితీరుపైన చేసిన సర్వేలో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయడుకు ఎనిమిదో స్ధానం దక్కటం కాసింత బాధాకరమే.
ఇక మిగిలిన వారిలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ 86 శాతంతో రెండోస్ధానం, 79 శాతంతో పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ మూడో స్ధానంలో, 75 శాతంతో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నాలుగో స్ధానంతో సరిపెట్టుకున్నారు.
మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవీస్ 62 శాతంతో ఐదో స్ధానం, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 61 శాతంతో ఆరు, రాజస్ధాన్ సిఎం వసుంధరా రాజే సింథియా 58 శాతంతో ఏడు, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు 58 శాతంతో ఎనిమిదో స్ధానంలో నిలిచారు. ఆ తర్వాత స్ధానాల్లో 52 శాతంతో విజయ్ రూపాని, 49 శాతంతో కర్నాటక సిఎం సిద్దరామయ్య, ఉత్తర ప్రదేశ్ సిఎం అఖిలేష్ యాదవ్ కు 43 శాతంతో 11వ శాతం దక్కించుకోవటం గమనార్హం.
మరో కొద్ది నెలల్లో ఎన్నికలను ఎదుర్కొనబోతున్న అఖిలేష్ కున్న ప్రజాధరణ ఏమిటో ఈ సర్వే శాంపిల్ చూపుతోందను కోవచ్చా. పోయిన సర్వేలో 69 శాతంతొ నిలిచిన చంద్రబాబు ఈ సర్వేలో ఎనిమిదో స్ధానానికి పడిపోవటం గమనార్హం.
ఇక, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణాలో 51 శాతం ఓట్లతో కెసిఆరే తిరిగి అధికారంలోకి రావటం ఖాయమని సర్వే చెబుతోంది. తెలంగాణాలోని మొత్తం 17 లోకసభ స్ధానాలు కూడా కెసిఆర్ ఖాతాలోనే పడతాయని కూడా సర్వే స్పష్టం చేస్తోంది. పాతబస్తీలో కూడా టిఆర్ఎస్ బలపడుతోందని కెసిఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు ఈ సర్వే ఒక విధంగా అద్దం పడుతున్నట్లు కనబడుతోంది.
