ఆర్టీసీ బస్సు డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. మృతురాలు సాయి దీపికారెడ్డిగా గుర్తించారు. యువతి జూబ్లిహిల్స్ లోని అపర్ణ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తోంది.

కాగా... మంగళవారం ఉదయం స్కూటీపై ఆఫీసుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పంజాగుట్ట నుంచి యూసుఫ్‌గూడ వెళ్లే మార్గంలో ఆంధ్రా బ్యాంక్ వద్ద సమీపంలో వెళ్తుండగా సాయి దీపికారెడ్డి స్కూటీ అదుపుతప్పింది. 

Also Read సవతి తల్లిని వెంటాడి... తలపై కర్రలతో కొట్టి.....

ఈ క్రమంలోనే కొండాపూర్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న( రూట్ నం. 10H) ఏపీ 11జెడ్ 7197 నంబర్ గల మెట్రో బస్సు ఆమెను వెనుక నుంచి ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో దీపిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కాగా... కుమార్తె ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే విగత జీవిగా మారడాన్ని ఆమె తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.